Sunday, September 8, 2024

ప్రతినెలా పెరుగుతున్న శ్రీవారి హుండీ ఆదాయం..

తిరుమల, ప్రభన్యూస్‌ : కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారు దేవుడైన తిరుమలేసునికి భక్తులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. గత కొద్ది మాసాలుగా కోనేటి రాయునికి భక్తులు హుండీ ద్వారా పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుండడంతో గత నాలుగు మాసాలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతినెలా 120 కోట్ల రూపాయలకు పైగా లభించగా, మే నెలలో ఏకంగా 130 కోట్ల రూపాయలు ఆదాయం స్వామివారికి హుండీ ద్వారా లభించింది. ఈ ఏడాది మార్చి నెలలో 128 కోట్లు, ఏప్రిల్‌ నెలలో 127.5 కోట్లు, మే నెలలో 130.5 కోట్లు, జూన్‌ మాసంలో 123.76 కోట్లు ఆదాయం లభించింది. ఇక జూలై నెలలో శ్రీవారికి టిటిడి చరిత్రలోనే రికార్డు స్థాయిలో హుండీ ద్వారా ఆదాయం లభించే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్లు మార్కును దాటగా ఇంకా ఈనెలలో 8 రోజులు మిగిలి ఉండడంతో శ్రీవారికి హుండీ ద్వారా 140 కోట్లు ఆదాయం లభించే అవకాశం కనపుడుతుంది.

ఈనెల 4 వ తేది టిటిడి చరిత్రలోనే అత్యధికంగా 6.18 కోట్ల రూపాయలను భక్తులు హుండీ ద్వారా స్వామివారికి సమర్పించారు. ఇక ఇప్పటికే ఈనెలలో 5.58,5.45,5.05 కోట్ల రూపాయలు ఇలా మూడు సార్లు 5 కోట్ల రూపాయలకు పైగా కానుకలు భక్తులు హుండీ ద్వారా స్వామివారికి సమర్పించారు. దీంతో జూలై నెలలో 21 రోజులకే స్వామివారికి హుండీ ఆదాయం 100 కోట్ల మార్కును దాటి ఇప్పటి వరకు ఈ మాసంలో శ్రీవారికి హుండీ ద్వారా 100 కోట్ల 75 లక్షలు ఆదాయం స్వామివారికి లభించింది. ఇలా సరాసరి ప్రతినిత్యం స్వామివారికి రమారమి 5 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుండడంతో ఈ నెలలో స్వామివారికి అత్యధిక స్థాయిలో ఆదాయం లభించే అవకాశం స్పష్టంగా తెలుస్తోంది. వడ్డీ కాసులవానిగా పేరుగాంచిన తిరుమలేశునికి పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుండడంతో ఈ ఏట స్వామివారి హుండీ ఆదాయం 1500 కోట్ల రూపాయల మార్గును దాటే అవకాసం కనపడుతోంది. టిటిడి ఊహించని స్థాయిలో భక్తులు స్వామివారికి హుండీలో కానుకలు సమర్పిస్తుండడంతో టిటిడి ఆర్ధిశాఖాధికారులు లెక్కతప్పాయి. ఈ ఏట బడ్జెట్‌లో శ్రీవారికి హుండీ ద్వారా 1100 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనావేయగా స్వామివారికి అంతకంటే అదనంగా ఆదాయం లభించనున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement