తిరుమల: కరోనా మహమ్మారి రాకతో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండానే నిర్వహించారు. రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈనెల (సెప్టెంబరు) 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకు మాడ వీధుల్లో వాహనసేవలుంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు 20వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడ సేవ ఉంటుందన్నారు.
కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనుండడంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు జరుగనున్న వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు:
- సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ.
- సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.15 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం.
- సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనం.
- సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం.
- సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం.
- అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.
- అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం(స్వర్ణ రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనం.
- అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం.
- అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనం.
- అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం.