Tuesday, November 26, 2024

Srisailam – ప్రజలకు ఇచ్చిన మాట తప్పని ముఖ్యమంత్రి చంద్ర బాబు – ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి

ఆత్మకూరు రూరల్,జూన్ 16 (ప్రభ న్యూస్)ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు చంద్రబాబు అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల కు ముందు ఇచ్చిన హామీల్లో ప్రధాన అంశాలైన ఐదు పథకాలపై సంతకాలు చేయడం హర్షణీయమన్నారు. ముఖ్యంగా ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు.

అయితే చంద్రబాబు మొదటి సంతకమే డీఎస్సీపై పెట్టడం, రైతులకు నష్టం చేకూర్చే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయడం, రూ.4వేలు పెన్షన్ చేయడం, నైపుణ్యగణనపై సంతకాలు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఏకంగా 16,347ఉపాధ్యాయ ఖాళీలు భర్తీచేస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించడం సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు..

- Advertisement -

గత ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రెండో సంతకాన్ని రద్దుపై పెట్టారన్నారు. భరోసా పింఛనను వైసీపీ ఐదేళ్లలో రూ.వెయ్యి పెంచిందని, అయితే హామీ ఇచ్చిన మేరకు చంద్రబాబు మొదటి నెల నుంచే రూ.4వేలు ఇస్తామని మూడోసంతకం పెట్టారన్నారు. అంతేకాక ఏప్రిల్‌ నుంచే ఇస్తామని చెప్పడంతో జూలై నెలలో రూ.7వేలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా తెలిపారు. దీనివల్ల రూ.66లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.

దివ్యాంగులకు రూ.6వేలకు పెంచారు. వారికి కూడా పెంచిన మొత్తం కలిపి రూ.12వేలు ఇవ్వనున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ కళాశాలల నుంచి 4.4లక్షల మంది విద్యార్థులు బయటికి వస్తున్నారని, సరైన నైపుణ్యాలులేక చాలా మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారన్నారు. అలాంటివారికోసమే నైపుణ్య గణన చేసి శిక్షణ ఇచ్చేందుకు చంద్రబాబు సంతకం చేశారని రాజశేఖర రెడ్డి అన్నారు. ఎంతో మంది నిరుపేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటినలను వైసీపీ అధికారంలోకి రాగానే రద్దుచేసిందని, అయితే వాటిని పునరుద్ధరిస్తూ చంద్రబాబు ఐదో సంతకం చేశారన్నారు. రాబోయే వంద రోజుల్లో అన్న క్యాంటినలు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు కడుపు నింపుతాయన్నారు.

దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి రోజే సంతకాలు పెట్టడం చంద్రబాబుకే సాధ్యమైందని శ్రీశైలం ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement