శ్రీశైలాన్ని తిరుమల తరహాలో ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా శ్రీశైలం వద్ద సీ-ప్లేన్ సర్వీసును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న నంద్యాల జిల్లా శ్రీశైలంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా… శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది, బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ-ప్లేన్ సర్వీసును సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు సందర్శించనున్న ప్రాంతాల్లోని రోప్-వే, బోట్ తదితర ప్రాంతాల్లో సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.
ఇక, సీప్లేన్ అందుబాటులోకి వస్తే పర్యాటకంగా అటు విజయవాడ, ఇటు శ్రీశైలం అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక రోజులోనే రెండు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం పర్యాటకులు, భక్తులకు లభించనుంది. ఈ సీ ప్లేన్ లు పర్యాటకంగానే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీలో, ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఉపయోగపడతాయి.