Thursday, September 12, 2024

Srisailam Dam : శ్రీశైలం జలాశయం – 8గేట్లు ఎత్తివేత

నంద్యాల బ్యూరో, ఆగస్టు 29 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు పది అడుగుల మేర‌ ఎత్తు కిందికి నీరు నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. దట్టమైన నల్లమల్ల కొండల మధ్య పక్షుల కిలకిలారావాల నడుమ పాలనురుగు లాంటి కృష్ణమ్మ నాగార్జున సాగర్ చెంతకు విరబిరా పరుగులు తీస్తుంటే ఆ దృశ్యం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఎగువ ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల మూలంగా జూరాల, సుంకేసుల, ఆల్మట్టి డ్యాములు నిండి కిందికి నీరు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, పూర్తిగా నిండుకున్నది. నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలుగా ఉంది. ఏగువ ప్రాంతం నుంచి నీరు అధికంగా రావడంతో 2,86,371 క్యూసెక్కుల నీరు కిందికి వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని మొత్తం కిందకి వదలడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఏపీ నుంచి 30,706 క్యూసెక్కుల నీటిని, తెలంగాణ నుంచి 37,465 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తిని కుడి, ఎడమల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాం కూడా పూర్తిస్థాయి నీటిమట్టంకు చేరుకున్నది. శ్రీశైలంకు నాగార్జున సాగర్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలోని భగవంతుని దర్శనంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

- Advertisement -

ఇంజనీరింగ్ అధికారులు తెలిపిన సమాచారం మేరకు పైన ఏగువ ప్రాంతంలో కూడా తుంగభద్ర డ్యామ్ 1633 అడుగుల నీరు పూర్తిస్థాయికి చేరుకున్నది. జూరాల స్కిల్ వే నుంచి 2,61,729 క్యూసెక్కుల నీరు, పీహెచ్ నుంచి 20,368 క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతం నుంచి వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే భారీ వాహనాలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం శ్రీశైలంకు రావడంతో పోతిరెడ్డిపాడు, ముచ్చుమరి ఎత్తిపోతల పథకం, హంద్రీనీవా ఎస్సార్ బీసీ, తెలుగు గంగ, వంటి కాలువలకు పూర్తిగా నీరు పంపుతున్నారు. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు కూడా నీటితో నింపాలని ప్రజాప్రతినిధులు ఇంజనీరింగ్ అధికారులకు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement