నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 6 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. బుధవారం బంద్ చేసిన డ్యామ్ గేట్లను తిరిగి గురువారం ఒక గేట్ పైకెత్తి 25వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. శుక్రవారం మరో రెండు గేట్లు ఎత్తి మొత్తం మూడు గేట్ల ద్వారా నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ సీజన్ లో మూడోసారి శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను ఎక్కి దిగువకు నీటిని విడుదల చేయడం విశేషం. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 885అడుగులు కాగా, ప్రస్తుతం 884.30 అడుగుల నీటిమట్టానికి చేరుకున్నది. నీటినిల్వ సామర్థ్యం 215.8040 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలుగా ఉంది.
విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ కోసం నిరంతరాయంగా సరఫరా చేయటం విశేషం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు 1,47,682 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని కిందికి వదులుతున్నారు.