కర్నూలు, ప్రభన్యూస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న కుంభ వర్షాలతో శ్రీశైల జలాశయంకు జలకళ ఉట్టిపడుతుంది. ఇప్పటికే నెల రోజులుగా కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి భారీ స్థాయిలో వరద నీరు శ్రీశైల డ్యాంకు చేరుకుంటుంది. దీంతో జలాశయం పూర్తిగా నిండిపోగా, డ్యాంకు చెందిన గేట్లను 7 ఎత్తి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో పాటు తెలంగాణా, కర్నూలు జిల్లా పరిధిలోని పలు ప్రాజేక్టులకు, కాలువలకు నీటిని విడుదలవుతుంది. బుధవారం శ్రీశైల జలాశయం నుంచి మొత్తం 3.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండగా, ఇక జలాశయంకు 2.91 లక్షల క్యూసెక్కుల నీరు వరద ప్రవహాంగా చేరుతుంది. ప్రస్త్తుతం శ్ర్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.20 అడుగులుగా ఉంది.
ఇక జలాశయంకు ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 2.42 లక్షల క్యూసెక్కుల నీరు, సుంకేసుల నుంచి 48768 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2.91 లక్షల క్యూసెక్కుల నీరు డ్యాంకు చేరుతుంది. మొత్తం ప్రవహంలో కృష్ణ నుంచి వస్తున్నవే అధికంగా ఉన్నాయి. దీంతో శ్రీశైల జలాశయంకు చెందిన 12 రేడియల్ క్రస్టు గేట్లలో 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన సాగర్‌కు 1.94 లక్షల క్యూసెక్కుల నీటినిద దిగువకు విడుదల చేస్తున్నారు.ఇక శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.80 టిఎంసిలకు గాను, ప్రస్తుతం 210 టిఎంసిలుగా నమోదైంది.
ఇదే సమయంలో శ్రీశైల జలాశయం నుంచి ఏపి పవర్‌హౌజ్‌కు 31177 క్యూసెక్కుల నీటి వినియోగంతో 16.176 మెగా యూనిట్లు, ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 31784 క్యూసెక్కుల నీటితో 16,58 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మల్యాల లిప్టు ఇరిగేషన్ నుంచి హంద్రీనీవా ప్రాజెక్టుకు 1688, పోతిరెడ్డిపాడు నుంచి 714 వల క్యూసెక్కులు, కల్వకుర్తి నుంచి 1600, స్పిల్‌వే నుంచి 1.94 లక్షల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3.50 లక్షల క్యూసెక్కుల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండటం గమనార్హం.