ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో లవన్న, ఆలయ ఛైర్మెన్ చక్రపాణిరెడ్డి నేతృత్వంలో వేదమంత్రాలు మంగళవాయిద్యాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, ప్రాకారోత్సవం జరిపారు. దివ్యకాంతులను ప్రసరింపజేస్తూ అష్టభుజాలు పలు ఆయుధాలతో నిజరూపాలంకరణలో దర్శనమిచ్చిన భ్రామరి అమ్మవారిని చూసేందుకు భక్తులు ఆలయ ప్రాకారంలో బారులుదీరారు. మహోత్సవాల్లో భాగంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిండంపై కళాకారులతోపాటు ఆలయ అధికారులను సిబ్బందిని యాత్రికులు అభినందించారు.
అందరి కృషితో ఉత్సవాలు విజయవంతం : ఈవో
అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కృషితోనే ఉగాది మహోత్సవాలు విజయవంతమయ్యాయని ఈవో లవన్న అన్నారు. ఆదివారం పరిపాలనా భవనంలో ఆలయ ప్రధాన విభాగాధిపతులు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలు సాఫీగా సాగేందుకు సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. కర్నాటక, మహారాష్ట్రతోపాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు అంచనాకు మించి తరలివచ్చారన్నారు. వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రతి భక్తుడి స్వామి అమ్మవార్ల దర్శనాలను కల్పించడంపై ధార్మిక సంఘాలు సైతం ప్రశంసించాయన్నారు.