Friday, November 22, 2024

వరద కోసం శ్రీశైలం ఎదురుచూపు.. క్రమేపీ పెరుగుతున్న నీటిమట్టం

అమరావతి, ఆంధ్రప్రభ : గోదావరి వరదలు క్రమేపీ తగ్గుముఖం పడుతుండగా, కృష్ణాలో వరద ఉధృతి ఇపుడిప్పుడే ప్రారంభమైంది. వరద నీటి కోసం ఎదురుచూస్తున్న శ్రీశైలంలో ఇన్‌ ప్లక్రమేపీ పెరుగుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌, తుంగభ్రద, జూరాల రిజర్వాయర్లు పొంగి పొర్లుతుండటంతో ఇపుడిపుడే శ్రీశైలం జలకళ సంతరించుకుంటోంది. సోమవారం రాత్రికి ఎగువ నుంచి శ్రీశైలానికి 3,14,275 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 33,384 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 865.8 అడుగుల దాకా వరద నీరు చేరింది. 215.43 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్ద్యానికి గాను 58.12 శాతం 125.43 టీఎంసీల నిల్వలున్నాయి. రెండు రోజుల నుంచి వరద ఉధృతి అనూహ్యంగా పెరిగింది. 48 గంటల్లోనే సుమారు 1.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు అదనంగా వచ్చి చేరింది.

ఒక వైపు తెలంగాణ ఎడమగట్టు పవర్‌ హౌస్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నా వరద ఉధృతి పెరగటం వల్ల శ్రీశైలం నీటి మట్టం పెరుగుతోంది. మరో రోజుల్లో నీటి మట్టం పూర్తిస్థాయి సామర్ద్యానికి చేరవచ్చని అంచనా. దిగువున నాగార్జునసాగర్‌ లోనూ 312.05 టీ-ఎంసీల నిల్వ సామర్ద్యానికి గాను 170.56 టీ ఎంసీలు, పులిచింతలలో 45.77 టీ ఎంసీల నిల్వ సామర్ద్యానికి గాను 36.91 టీ-ఎంసీల నీటి నిల్వలున్నాయి. కృష్ణా బేసిన్‌ లో దిగువున్న ఉన్న ప్రకాశం బ్యారేజి నిండుకుండలా దర్శనమిస్తోంది. 3.07 టీ ఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వలతో జలకళ సంతరించకుంది. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 10,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

అవుట్‌ రూపంలో బ్యారేజిలోకి సోమవారం రాత్రికి 10,350 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంకు ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 1,50,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. జూరాల నుంచి 1,65,000 క్యూసెక్కులు, నారాయణపూర్‌ నుంచి 1,60,000 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,67,989 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. మరో రెండు మూడు రోజుల్లో ఎగువ నుంచి శ్రీశైలంకు చేరే వరద ఉధృతి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అంచనా. శ్రీశైలం ప్రాజెక్టుకు సామర్ద్యానికి మించి వరద నీరు చేరితే గేట్లు- ఎత్తి నాగార్జున సాగర్‌ కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement