సాంప్రదాయ బద్ధంగా తీసుకువచ్చిన ఆలయ అధికారులు..
స్వాగతం పలికిన ఈవో కె ఎస్ రామారావు..
(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మకు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం నుండి పవిత్ర సారేను సమర్పించారు. ఆషాడ మాసం సందర్భంగా దేవస్థానంలో శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం, శ్రీశైలం నుండి ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ అధికారులు కనకదుర్గ అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు.
అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి సారే తెప్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీశైలం దేవస్థానం వారు శ్రీ దుర్గ గుడి కార్యనిర్వాహనాధికారి కేఎస్ రామారావు, సిబ్బందికి శ్రీశైలం దేవస్థానం శేషవస్త్రం, ప్రసాదములు చిత్రపటము అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మహామండపం 6వ అంతస్తు లో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, అందరికీ ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది, సహాయ కార్యనిర్వాహనాధికారి , శ్రీశైలం దేవస్థానం అర్చకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.