తిరుపతి ( రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) తిరుపతి కేంద్రం గా పని చేసే రాష్ట్ర స్థాయి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు (ఆర్ఎస్ఎఎస్టీఎఫ్) నూతన ఎస్పీగా పి.శ్రీనివాస్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఆయన కాకినాడ అదనపు ఎస్పీగా పని చేస్తూ ఇటీవలే ఎస్పీగా పదోన్నతి పొందారు.
ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం సంపదను స్మగ్లర్లు కొల్లగొట్టకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. టాస్క్ ఫోర్సు అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎర్రచందనం కాపాడుతామని అన్నారు. కూంబింగ్ ఆపరేషన్లు పెంచి, సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు. ఇంటర్ స్టేట్ ఆపరేషన్లు, ఇతర శాఖల సహకారంతో సమర్థవంతంగా విధులు చేపడుతామని అన్నారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు, రిజర్వు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, సురేష్ కుమార్, ఎసీఎఫ్ జే.శ్రీనివాస్ ఇంకా ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు ఆయనకు స్వాగతం పలికారు.