Friday, November 22, 2024

Srikalahasthi – ముక్కంటి క్షేత్ర మాస్టర్ ప్లాన్ కు త్వరలో మోక్షం …

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : సుప్రసిద్ధ రాహుకేతు క్షేత్రం శ్రీ కాళహస్తి దేవస్థానం ఆరేళ్ళ క్రితం చేపట్టిన మాస్టర్ ప్లాన్ కు త్వరలో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ 300 కోట్ల వ్యయం తో రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలుకు భూసేకరణ దశలో చోట చేసుకున్న న్యాయపరమైన చిక్కులే ఆటంకంగా మారింది.  అటు శాసన సభ్యుడు , ఇటు దేవస్థానం సంయుక్తంగా చేస్తున్న కృషి ఫలించి మూడు దశల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ  అనుకున్నట్టు జరిగితే మరో నెలరోజుల్లోనే శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్ పనులు మొదలయ్యే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

దక్షిణ కాశీ గా పేరొందిన శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రానికి ప్రతిరోజూ సగటున 30 వేల మంది, ప్రత్యేక దినాలలో రోజుకు సగటున 40 వేల మంది చొప్పున భక్తులు వాయులింగేశ్వరుని దర్శనానికి  వస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను  విస్తరింప చేయడం తో పాటు అనుబంధ క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి ఆరేళ్ళ క్రితం మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగింది. దాదాపు రూ 100 కోట్లు వెచ్చించి భూసేకరణ చేపట్టినా నిర్మాణం పనులు చేయకపోవడం తో ప్లాన్ మూలన పడింది. ఇందుకు భూసేకరణ సందర్భంగా ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కూడా ప్లాన్ అమలుకు మౌలిక ఆటంకంగా తయారైంది. ఆయాకాలాల్లో అధికారులు,ప్రజాప్రతినిధులు ప్రయత్నించినా ప్లాన్ ముందుకు సాగలేదు. ఫలితంగా గత ఆరేళ్లుగా శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్ అమలు కదిలీ కదలని స్థితికి చేరుకుంది.    

- Advertisement -

ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ మాస్టర్ ప్లాన్ అమలు కు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుత శాసన సభ్యుడు,బియ్యపు మధుసూదన రెడ్డి చొరవతో  దేవస్థాన పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అద్వర్యం లో  మూలన పడిన మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ముందుగా మధుసూదన రెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి ఆయనకు మాస్టర్ ప్లాన్ గురించి వివరించి  అనుమతి తీసుకున్నారు.  ద్రోణ అనే కన్సల్టెన్సీ సంస్థ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ పనులను మూడు దశల్లో అమలు చేయడానికి వీలుగా రూపొందించిన ప్రతిపాదనలను అధికారులు  ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు, ప్రతిపాదనలలోని వివరాల ప్రకారం మొదటి దశలో రెండు బారీ భవన నిర్మాణాలను చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు.

గాలిగోపురం నుంచి జల వినాయకుడి ఆలయం వరకు రెండతస్తుల క్యూ కాంప్లెక్స్ తరహా నిర్మాణం, , అక్కడి నుంచి 4వ నెంబర్ గేటు వరకు ఆలయం చుట్టూ విస్తరించే విధమైన  నిర్మాణం పనులు,, సర్పదోష మండపాలు, దూర్జటి కళా మండపం మొదలైన నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రెండోదశలో స్వర్ణ ముఖి ప్రక్షాళన స్నాన ఘట్టాలు, మూడోదశలో భరద్వాజ తీర్థం, అతిధి గ్రహాల నిర్మాణపనులు చేపట్టాలనుకుంటున్నారు. ఒకటో నెంబర్ గేట్ నుంచి నాలుగో నెంబర్ గేటు వరకు 500 మీటర్ల పొడవుతో రెండు భారీ భవన నిర్మాణాలు చేపట్టనుంది. మొదటి భవనంలో రెండు అంతస్తులతో  330 మీటర్ల పొడవుతో రెండు వైపులా గాలి వెలుతురు ఉండేలా ఓపెన్ క్యూ కాంప్లెక్స్ లు, కారు, బైక్ పార్కింగ్ ప్రాంతాలు ఉండేలా నిర్మాణాలు జరగబోతున్నాయి. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులతో పాటు వివిధ దర్శన  టికెట్లు తీసుకున్న భక్తులు దాదాపు 15 వేల మంది వరకు మూడు గంటల సమయంలో స్వామి అమ్మవారిని దర్శించుకునేలా క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. 

ఇక రెండోభవనం నిర్మాణంలో మూడో నెంబర్ గేట్ నుంచి నాలుగో నెంబర్ గేట్ వరకు 170 మీటర్ల పొడవుతో రెండంతస్తుల భవనం నిర్మాణం జరగబోతోంది. మొదటి అంతస్తు మల్టీపర్పస్ గా వినియోగించుకునేందుకు ఓపెన్ హాల్ నిర్మాణంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా మిగతా రోజుల్లో రాహు కేతు పూజలు పాల్గొనే భక్తులు వేచి ఉండే వెయిటింగ్ హాల్ గా వినియోగించుకునేందుకు వీలుగా రూపకల్పన చేశారు. రాహుకేతు పూజలు జరుపుకునే మండపాల నిర్మాణాలు, వీఐపీలు వివిఐపి భక్తులు నేరుగా నాలుగో నెంబర్ గేట్ నుంచి వెళ్లి దర్శనం చేసుకునేలా క్యూ లైన్ ఏర్పాటు కోసం నిర్మిస్తారని తెలుస్తోంది.

తరువాత దశల్లో  స్వర్ణముఖి నది ప్రక్షాళన, స్నాన ఘట్టాలు, భరద్వాజ తీర్థం బ్యూటిఫికేషన్ లాంటి పనులతో మాస్టర్ ప్లాన్ పనులు పూర్తి అవుతాయని తెలుస్తున్నది. మరోవైపు కొన్ని చోట్ల  ఆటంకం గా ఉన్న న్యాయపరమైన చిక్కుల విషయం లో కూడా మధుసూదన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత వ్యక్తులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రస్తుతానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా సానుకూలత ఉన్నందున, అన్నీ అనుకున్నట్టు జరిగితే  మరో నెల రోజుల్లోనే మాస్టర్ ప్లాన్ పనులు మొదలు అవుతాయని, మరో  రెండు మూడేళ్ళలో శ్రీకాళహస్తి క్షేత్రం రూపు రేఖలు మారిపోతాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement