శ్రీకాకుళం : స్వామి వివేకానంద చెప్పిన సూక్తులు, బోధనలు నేటి యువతకు ఆదర్శమని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గురువారం స్థానిక సూర్యమహల్ కూడలి వద్ద గల వివేకానంద విగ్రహానికి పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవిలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని గుర్తు చేసారు. అటువంటి మహనీయుని జన్మ దినోత్సవాలతో ఆయన బోధనలను మననం చేసుకునేందుకు ఒక అవకాశం కలుగుతుందన్నారు. ఆయన చెప్పిన మాటలు, బోధనలు యువత తప్పక చదవి, వారి జీవితాలను గొప్పగా మలుచుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో, కష్టకాల సమయంలో నేటి యువత వాటిని ధైర్యంగా ఎదుర్కొని గొప్పగా జీవించేందుకు వివేకానంద సూక్తులు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. యువత మానసికంగా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలంటే వివేకానంద స్పూర్తి అవసరమన్నారు. ఉక్కునరాలు కలిగిన యువతను అందిస్తే దేశాన్ని మారుస్తానని వివేకానంద పిలుపునిచ్చారని, నేడు 80కోట్ల యువత ఉన్న మనదేశం మరింత ముందుకువెళ్లాల్సి ఉందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement