Friday, November 22, 2024

తీరనున్న తీరప్రాంతవాసుల కల..!

  • వంశధారపై రూపుదిద్దుకుంటున్న వనిత మండలం – గార వంతెన
  • రూ. 72 కోట్లు మంజూరు చేయించిన ధర్మాన కృష్ణదాస్
  • వచ్చే వేసవి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం
    పోలాకి : వంశధార నదీ తీర ప్రాంతీయుల దశాబ్దాల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. బతికుండగా చూస్తామో? లేదో? ననే కల ఎట్టకేలకు తీరనుంది. నరసన్నపేట – శ్రీకాకుళం నియోజక వర్గాలను కలుపుతూ వంశధార నదిపై పోలాకి మండలంలోని మబగాం వనిత మండలం గ్రామాల నుంచి గార మండలానికి వంతెన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పురాతన కాలంలో గార మండలంలోని శాలిహుండాం నుంచి వనిత మండలానికి వంశధార నదిపై వంతెన ఉండేదని ప్రాచీన గ్రంథాల‌లో ఆనవాళ్లు ఉన్నాయి. బంధువులు చుట్టరికాలు అటు ఇటు ఉన్నవారే. నది దాటితే చాలు అటు ఇటు బంధు మిత్రులతో గ్రామాలు కలకలలాడేవి. వ్యవసాయ, మత్స్య సంపద, వాణిజ్యంతో ఎంతో వైభవంగా ఉండేది. కానీ ఇప్పడు పొలాకి మండలంలోని వారు గార మండలానికి వెళ్లాలన్నా, అటువారు ఇటు రావాలన్నా చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తాను ఆర్అండ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే రూ.72 కోట్ల రూపాయలు ఈ వంతెన నిర్మాణానికి మంజూరు చేశారు. అంతకు ముందు ప్రభుత్వాలు వీటికి ప్రతిపాదనలు మాత్రమే చేసి వదిలేసాయి. తాజాగా దీనికి రూ.12 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వంశధార నదిపై 600 మీటర్ల పొడవున నిర్మాణం చేస్తున్న ఈ వంతెనకు మబుగాం నుంచి వెయ్యి మీటర్ల పొడవులో అప్రోచ్ రోడ్డుని నిర్మిస్తారు. అదేవిధంగా గార మండలం వైపున 400 మీటర్లతో అప్రోచ్ రోడ్డుని నిర్మాణం చేయనున్నారు.

    వనిత మండలం వంతెన పనులను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, యువనేత, పోలాకి జడ్పీటీన్ సభ్యులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య బుధవారం పరిశీలించారు. కాంక్రీట్ పనులను కాసేపు దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. వనిత మండలం-గార వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రానున్న వేసవి నాటికి ఈ వంతెన పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల పనులను వేగంగా పూర్తి చేయడానికి తగిన నిధుల్ని అందిస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న సీఎం వైఎస్ జగన్ రహదారుల అభివృద్ధిపై చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని అన్నారు. తాను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకరనారాయణ పర్యటించారని గుర్తు చేసుకున్నారు. తాము హామీలు ఇచ్చిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ఈ సందర్భంగా కృష్ణ దాస్ పేర్కొన్నారు. యువనేత, జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ.. ఈ వంతెన పూర్తయితే గార మండలం నుంచి నరసన్నపేట నియోజకవర్గానికి రాకపోకలు సాగించేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఇక్కడికి రాకపోకలు సాగించేవారు చుట్టుతిరిగి సింగుపురం మీదుగా చేరుకుంటున్నారని తెలిపారు. ఈ వంతెన నిర్మాణం వల్ల నరసన్నపేట – శ్రీకాకుళం నియోజకవర్గాల గ్రామీణ ప్రాంతాలవారికి మంచి సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. వీరితో పాటు ఈ పర్యటనలో స్థానిక నాయకులు, రైతులు సోమరాజు పెంటయ్య, ఎన్ని వెంకటేష్, కంచు రమణమూర్తి, ధర్మాన ఎర్రప్పడు, ఆర్అండ్ బీ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement