శ్రీకాకుళం, మార్చి 21: శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గం ఇంచార్జ్ గుండ లక్ష్మీదేవికి కాకుండా గొండు శంకర్ కు ఇస్తున్నట్లు ప్రకటించడంతో గుండ లక్ష్మీదేవి అనుచరులు, అభిమానులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవికి టిక్కెట్ రాకపోవడంతో శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి ఆమెను కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తీవ్ర వత్తిడి తీసుకొస్తున్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యానర్లను, గుండ లక్ష్మీదేవి దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను చించి వేసి తగులబెట్టారు.
అభిమానులు, అనుచరులు, కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఆమె రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా ? వద్దా ? అన్నదానిపై అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు శివగంగాధరతో ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో శివ గంగాధర్ జిల్లాకు వచ్చి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై తెలియజేస్తారని, ఆ మేరకు గుండ దంపతులు ఒక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఆమెను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన, అనుమానాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయి.