శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం పేదల పెన్నిదని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైయస్సార్ బీమా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. బీమా చెక్కులను ఆయా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో స్పీకర్ మాట్లాడుతూ జిల్లాలో 408 మంది పేద లబ్దిదారులు వైయస్సార్ బీమా కింద రూ.8.76 కోట్లను పొందారని చెప్పారు. బీమా పథకం కింద అర్హులై బ్యాంకుల్లో నమోదు కాకుండా మిగిలిపోయి, దురదృష్టవశాత్తూ మరణించిన 12,039 మంది కుటుంబాలకు మానవతా దృక్పథంతో బీమాకు సమానమైన రూ.254 కోట్ల మొత్తాన్ని రాష్ట్రంలో చెల్లించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం రూ.510 కోట్ల ఖర్చుతో అర్హత ఉన్న 1.41 కోట్ల నిరుపేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ కల్పించడం జరుగుతోందని ఆయన చెప్పారు. గతంలో ప్రతి పాలసీకి పిఎంజెజెబివై, పిఎంఎస్ బివై క్రింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 శాతం వాటా ప్రస్తుతం విడుదల లేనప్పటికీ మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుందని తద్వారా దురదృష్టవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిస్తూ 2020 అక్టోబర్ 21న వైఎస్సార్ బీమా పథకం ప్రారంభించిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు గ్రామ సచివాలయం నుండి తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తుందని అన్నారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి సహజ మరణం పొందిన వ్యక్తులకు రెండు లక్షల రూపాయలు, 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగి ప్రమాదం వలన మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, 51 నుండి 70 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి మూడు లక్షలు., 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగి పాక్షిక శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి లక్షా 50 వేల రూపాయలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. పేదల పక్షపాతి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement