శ్రీకాకుళం, సెప్టెంబర్ 26 : శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఏడు రోడ్ల కూడలి వద్ద ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ వద్ద నాగావళి నదీతీర ప్రాంతంలో పరిశుభ్రత కోసం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో కలసి గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాగావళి, వంశధార నదుల పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చే మురుగు నీటిని ఒకే ప్రాంతానికి చేర్చి దానిని శుభ్రపరచి నదిలో వదిలే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఇందుకు నిదులు, భూమిని కూడా కేటాయించినట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల నుండి సేకరించిన చెత్తను రివర్ వ్యూ పార్క్ దగ్గరలో డంప్ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు వినియోగించే కొబ్బరి బొండాలు, డైపర్స్, షాంపూ ప్యాకెట్లు, తదితరమైన వ్యర్థ పదార్థాలు నదీ తీర ప్రాంతంలో వేయరాదని, వ్యర్థాలను ఇంటి వద్దే వుండనిస్తే పారిశుధ్యం కార్మికులు వచ్చి తీసుకెళ్తారన్నారు. సేకరించిన చెత్తను విశాఖపట్నంలో గల వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కు తరలిస్తామన్నారు. రోడ్లపైన, కాలువల్లో చెత్త వేస్తున్నారని, ప్రజలు గమనించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సహకరించి క్లీన్ అండ్ గ్రీన్ లో మంచి ర్యాంకు సాదించాలన్నారు. స్వచ్ఛత హి సేవా ఒక్క శ్రీకాకుళంలోనే కాదు జిల్లా అంతటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటుందని, ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ… నదులు దైవాలతో సమానమని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార నదుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. దేశంలో స్వచ్ఛ నగరాల జాబితాలో శ్రీకాకుళం ఉండాలనేది లక్ష్యమన్నారు. శ్రీకాకుళం నగరంలో నాగావళి నది ప్రవహించే ఒడ్డున సుందరమైన పార్కులు, చక్కని రహదారి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యర్థ పదార్థాలు నదిలో ఎవరూ వేయొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరం నుండి వచ్చే మురుగునీరు శుభ్రపరచి నాగావళి నదిలోకి విడిచిపెట్టే కార్యక్రమానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంతాను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నగరంలోని మిర్తి బట్టి పనులను పున:ప్రారంభిస్తామన్నారు. నదీ పరివాహక ప్రాంతం ప్రక్క నుండి ఒక రోడ్డు ఏర్పాటు చేసి నగరవాసులు నడచుకోడానికి, సైక్లింగ్, చిన్న, చిన్న వాహనాలను డైవర్ట్ చేయవచ్చని అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడమైనదని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలంతా తమ వంతు సహాయ సహకారాలు అందించి స్వచ్ఛత నగరానికి మంచి ర్యాంకు రావడానికి అందరూ సహకరించాలని కోరారు.
జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ… చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇంటి వద్దే ఉంచితే పారిశుధ్య కార్మికులు వచ్చిన తర్వాత వారికి అందజేయాలన్నారు. మన ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. శుభ్రంగాను, ఆరోగ్యకరంగా ఉంటుందని పేర్కొన్నారు. పోలీసు స్టేషన్ లో కూడా పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించడమైనదని, పోలీసు స్టేషన్లే కాకుండా పరిసరాలను శుభ్రపరచు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నిత్య జీవితంలో పరిశుభ్రతను ఒక భాగంగా చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
అనంతరం పార్కులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, శాసన సభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మొక్కలు నాటి పెయిటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. మీనాక్షి, ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి బి. తారక ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ బి.కరుణ శ్రీ, రిటైర్డ్ ఆర్డీఓ పిఎంజె బాబు, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, తదితరులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.