Friday, November 22, 2024

పక్కాగా ఎన్నికల ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ నివాస్

శ్రీకాకుళం, : జిల్లాలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు . శనివారం జిల్లా పరిషత్ ఎన్నికల మాస్టర్ ట్రైనీల శిక్షణా కార్యక్రమం అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 590 ఎం.పి.టి.సి, 37 జెడ్.పి.టి.సి స్థానాలకు ఎన్నికలు జరగానున్నాయని అన్నారు. ఇందుకు సంబంధించి పోలింగ్ అధికారులకు ఈ నెల 5న శిక్షణను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగా మాస్టర్ ట్రైనీలకు నేడు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2287 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, వీటికి సంబందించిన సిబ్బందికి ఉత్తర్వులు జారీచేశామని అన్నారు. కౌంటింగ్ అంశంపై అధికారులతో చర్చించి శాసనసభ నియోజక వర్గ స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ జరిగితే బాగుంటుందని నిర్ణయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లు, పర్యవేక్షణ కొరకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, వీరే ఆర్.ఓలుగా వ్యవహరిస్తారని అన్నారు. అలాగే డిప్యూటీ కలెక్టర్ లేదా సీనియర్ ఆఫీసర్ స్థాయి గల ఒక అధికారిని ప్రతీ నియోజకవర్గానికి నియమించడం జరిగిందని, వీరు మండలానికి చెందిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రేషప్షన్ వ టి ఏర్పాట్లు పర్యవేక్షిస్తారని కలెక్టర్ వివరించారు. పోలింగ్ మరియు కౌంటింగ్ ఏర్పాట్ల దృష్ట్యా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సి.సి కెమెరాలు ఏర్పాటుచేసి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని, సి.సి.కెమెరాలు లేనిచోట్ల వీడియోగ్రాఫర్ ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటింగ్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైందని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ చెప్పారు. కావున ప్రజలు భారీఎత్తున ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement