శ్రీకాకుళం, నవంబర్ 6(ప్రభన్యూస్)
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ ఉపసంహరించుకోవాలని, మీడియాపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, కిసాన్ రైతు కాంగ్రెస్ నాయుకులు ఎస్. అన్నాజీరావు, కౌలు రైతు సంఘం నాయుకులు బి.కృష్ణమూర్తి ఎఐటియుసి నాయుకులు చిక్కాల.గోవిందరావు డిమాండ్ చేశారు.
కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక సంఘీభావ దినం సందర్భంగా అఖిలపక్ష రైతు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. న్యూస్ క్లిక్ పై పెట్టిన అక్రమ కేసుల ఎఫ్ఎస్ఐఆర్ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1000 రోజులుగా నిరాహారదీక్షలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ప్రజా ఉద్యమంగా, అన్ని ప్రజా సంఘాల ఉద్యమంగా నడుస్తోందని అన్నారు. నిరంతరంగా పోరాటం జరుగుతున్నందున ఇప్పటి వరకు ప్రైవేటీకరణ చెయ్యటం మోడీ ప్రభుత్వానికి సాధ్యం కాలేదన్నారు. దేశంలో అన్ని ప్రభుత్వ,ప్రయివేటు స్టీల్ ప్లాంట్ లకు స్వంత గనులు ఉన్నాయని కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు స్వంత గనులు కేటాయించడం లేదని తెలిపారు. మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైన ఉక్కు కర్మాగారాన్ని చౌకగా విదేశి పోస్కోకు, అదానీకి అప్పగించాలని మోడి శతవిధాల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తూ, ప్రత్యేకించి మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఐక్య ఉద్యమానికి మద్దతుగా నిలబడిన న్యూస్ క్లిక్ వార్త ఛానల్ పై మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందని అన్నారు. రాజ్యాంగం అనుమతించిన భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా మోడీ ప్రభుత్వం కాలరాసింది. న్యూస్ క్లిక్ జర్నలిస్టులు ప్రబీర్ పురకాయస్త, అమిత్ చక్రవర్తులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టింది. జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించి వారిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమాన్ని మోడీ ప్రభుత్వం జాతి వ్యతిరేకమైనదిగాను, ఈ ఉద్యమానికి విదేశాల నుండి, ఉగ్రవాదుల నుండి నిధులు వస్తున్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. ఈ అసంబద్ధమైన ప్రచారాన్ని మోడీ ప్రభుత్వం మానుకోవాలని, న్యూస్ క్లిక్ వార్తా సంస్థకు చైనా నుండి నిధులు వచ్చాయని, ఆ నిధులను ఆ సంస్థ రైతు ఉద్యమానికి ఖర్చు పెట్టిందన్న తప్పుడు ఆరోపణలను వారు ఖండించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అదానీ,అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతూ కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తూ కార్మిక, కర్షకులకు ద్రోహం చేస్తుందని అన్నారు. కార్మిక హక్కులు కాలరాస్తూ పెట్టుబడిదారులకు కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చేవిధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ప్రజల త్యాగాలతో జాతి నిర్మించుకున్న ప్రభుత్వరంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్.ఐ.సి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులు ఒక్కమాటలో చెప్పాలంటే దేశ ఆర్ధిక సర్వస్వాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక రైతు సంఘాలు నాయుకులు బి.కృష్ణమూర్తి, అల్లు.సత్యనారాయణ, ఎన్.గణపతి, ఎమ్.ఆదినారాయణ మూర్తి, హెచ్.ఈశ్వరరావు, కె.సూరయ్య, జి.అమరావతి, పి.గోపి, ఎమ్.రమణ, అశోక్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.