Friday, November 22, 2024

SKLM: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై పూర్తి అవగాహనతో ఉండాలి… మనజీర్ జిలాని సమూన్

(ప్రభ న్యూస్ బ్యూరో) శ్రీకాకుళం, జూన్ 3: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా కౌంటింగ్ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ అధికారులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇవాళ‌ ఉదయం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బ్యాలెట్ లెక్కింపుపై సంబంధిత అధికారులకు ఏవిధమైన అవగాహన వుందో తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్లి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి, వారు వెలిబుచ్చిన పలు సందేహాలను నివృత్తి చేశారు.

ఈ శిక్షణ ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు సంబంధించిన అంశాలను క్షుణంగా తెలుసుకొని జూన్ 4వ తేదీన కౌంటింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో ఫారం-13సి, ఫారం-13ఎ, ఫారం-13బి లకు సంబంధించిన అంశాలను తెలిపారు. వాటిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే సర్వీస్ ఓటర్లకు సంబంధించి బ్యాలెట్ల లెక్కింపులో పూర్తి జాగ్రత్త వహించి మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. ఎలాంటి సొంత అలోచనలకు తావివ్వకుండా ఎన్నికల నిబంధనలను విధిగా పాటించి ఓట్లలెక్కింపు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.గణపతి రావు, జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement