Tuesday, November 26, 2024

SKLM: రూ.40 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్… కలెక్టర్

శ్రీకాకుళం, ఆగస్టు 29 (ప్రభ న్యూస్ బ్యూరో) : మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.40కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఖేలో ఇండియా పథకంలో భాగంగా పాత్రుని వలసలో కేంద్ర ప్రభుత్వ నిధులతో దీని నిర్మాణం పూర్తి చేసి రెండేళ్లలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అలాగే పాత్రునివలసలో ఇప్పటికే నిర్మిస్తున్న క్రీడా వికాస ప్రాంగణంతో అన్ని క్రీడాంశాలను ఒకే చోటుకు తీసుకువస్తామని చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శాంతినగర్ కాలనీలోని డీఎస్ఎ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మేజర్ ధ్యాన్ చంద్ కు దేశం మొత్తం ప్రతి ఏటా ఇచ్చే గొప్ప నివాళిగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. చదువుతో పాటు క్రీడలను సమన్వయం చేసుకున్న వారు జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే మానసిక దృఢత్వం సాధించవచ్చని, క్రీడల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు అందుకోవచ్చని, గెలవడం కోసం చేసే ప్రణాళిక, శిక్షణ ఇవన్నీ భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తాయని చెప్పారు. కోడి రామకృష్ణ స్టేడియం చుట్టూ ప్రేక్షకుల గ్యాలరీ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు.

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ… జిల్లా కేంద్రంలో కోడి రామకృష్ణమూర్తి స్టేడియం నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రతివారం పనుల పురోగతిని తాను స్వయంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం గొప్ప అవకాశమని, దానిని వదులుకోవద్దని, క్రీడాభివృద్ధికి క్రీడాకారులు, ఆయా క్రీడా సంఘాలు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడాంశాల్లో విజయం సాధించిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

కలెక్టర్, ఎమ్మెల్యే ఇద్దరు కలిసి పలువురు క్రీడాకారులను శాలువా, మెమొంటో, ధ్రువీకరణ పత్రాలతో సత్కరించారు. తొలుత కార్యక్రమాన్ని ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడంతో మొదలుపెట్టారు. అంతకుముందు ఏడు రోడ్ల కూడలి నుంచి శాంతినగర్ కాలనీ ఇండోర్ స్టేడియం వరకు క్రీడాకారులు 2కే ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్డివో కే.శ్రీధర్, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, ఒలింపిక్ అసోసియేషన్ సలహాదారు సుందరరావు మాస్టారు, కోచ్ లు మాధురి, మణికంఠ, పలు క్రీడాభిమానులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement