శ్రీకాకుళం, అక్టోబర్ 19 (ప్రభ న్యూస్) : అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఏపీసీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గురువారం దర్శించుకున్నారు. ఆలయ సందర్శనకు విచ్చేసిన ఛైర్మన్ కు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేసారు.
ఈ సందర్భంగా అనివెట్టి మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను ఛైర్మన్ కు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయ విశిష్టతను ఛైర్మన్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి శ్రీనివాస్ జీవన్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశవ రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి కె. బాల మాన్ సింగ్ అరసవిల్లి దేవాలయ సుపరేంటెండెంట్ కృష్ణమాచార్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వారికి ఇళ్లస్థలాలు… కొమ్మినేని శ్రీనివాసరావు
జర్నలిజాన్నే వృత్తిగా చేసుకొని, నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్ని విధాలా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తోందని ఎపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం ఆర్అండ్‌బీ అతిథి గృహంలో జర్నలిస్టుల బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కొమ్మినేని మాట్లాడుతూ.. పాత్రికేయ వృత్తిలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న అనేక మంది పాత్రికేయులు కడు పేదరికాన్ని, దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, అటువంటి వారందరికీ సొంతింటి కల నేరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులై ఉండి, గతంలో ఎన్నడూ ఇంటి స్థలంగానీ, ఇళ్లుగానీ పొందనటువంటి నిరుపేదలైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని వివరించారు. రాజకీయ పార్టీలకు కొమ్ము కాసేలా వార్తలు రాయకుండా విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్న వారికి ఎల్లప్పుడూ సమాజంలో సముచితమైన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు.