శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు వలన నదులు, చెరువులు, వాగులు, వంకలు పూర్తిస్తాయిలో నిండియున్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లరాదని సంయుక్త కలెక్టర్ ఎం.విజయ సునీత జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె ఛాంబరులో జిల్లాలోని వర్షాభావ పరిస్థితులపై బులెటిన్ విడుదల చేసారు. వర్షాభావం వలన ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గ్రామస్థాయి ప్రజలకు వాలంటీర్లతో సహా సిబ్బందితో వరద ప్రభావ పరిస్థితులపై ఎప్పటికపుడు హెచ్చరికలు జారీచేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. పలాస మండలం కేదారిపురంలో ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగిందని, ఇటువంటివి జరకుండా జిల్లా యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసినట్లు ఆమె వివరించారు.
జిల్లాలోని అన్ని నదులు, చెరువులు, వాగులు, వంకలు అత్యధికంగా ప్రవహిస్తున్న కారణంగా వాటిని దాటడం, దిగడం చేయరాదని, అలాగే స్నానాలకు వెళ్లడం, బట్టలు ఉతకడం వంటివి చేయరాదని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆమె కోరారు. గత రాత్రి జిల్లాలో 948 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదయిందని, సగటున 31 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు ఆమె వివరించారు. దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని, సారవకోట, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని అని స్పష్టం చేశారు. జిల్లాలో అత్యధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసి సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు ఆమె చెప్పారు. కంట్రోల్ రూమ్ ద్వారా పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని, వర్షాలు తగ్గిన వెంటనే దీనిపై దృష్టి సారిస్తామని ఆమె వివరించారు. అధిక వర్షాల వలన వ్యవసాయ పరంగా దెబ్బతిన్న పంటలకు రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు జెసి స్పష్టం చేశారు. వర్షాలు తగ్గేవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.