Saturday, November 23, 2024

చంద్రబాబు అహంకారి.. పేదల ఇళ్లను సమాధులంటారా..! : ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం(జలుమూరు) : దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహా యజ్ఞంలా ఇక్కడ పేదల ఇళ్ల నిర్మాణం సాగుతుంటే వాటిని సమాధులతో పోల్చుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన దురఃకారానికి ప్రతీకని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. ఓట్లు వేయడానికి మాత్రమే పేదలు పరిమితం కావాలా? పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపుమంట? అని ప్రశ్నించారు. బాబు వ్యాఖ్యలకు నిరసనగా చల్లపేట జంక్షన్లో జగనన్న కాలనీలో పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఒక్క సెంట్‌ భూమి ఇవ్వని బాబుకు, టీడీపీకి సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

చంద్రబాబు తీరు మార్చుకోకపోతే ఆయన్ను రాజకీయ సమాధి చేసేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తోందని ఎంతమంది ఏకమైనా మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ వస్తారని అన్నారు. పేదలంటే చంద్రబాబుకు చులకన భావమని, వారంతా ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని కృష్ణ దాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, వైస్ ఎంపీపీలు తంగి మురళీకృష్ణ, డోల నాగరత్నం, అల్లాడ, చల్లవానిపేట సొసైటీ అధ్యక్షులు ఎం.శ్యా మలరావు, రాజప్పల నాయుడు, సచివాలయ కన్వీన‌ర్ ధర్మాన జగన్, పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సీతారాం, మండల సలహాదారుడు పైడి విఠలరావు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు బుక్కా లక్ష్మణరావు, దామ మన్మధరావు, జుత్తు నేతా జి, కరవంజ కూర్మారావు, పంగ వసంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement