Monday, November 18, 2024

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సిద్ధం

శ్రీకాకుళం, ఏప్రిల్ 2 : జిల్లాలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పరిషత్ ఎన్నికల నిర్వహణపై వివరాలను అందించారు. ఈ నెల 8వ తేదీన జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన పేర్కొంటూ ఓటర్ల అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు మన హక్కు అని ఓటును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ తెలియజేస్తూ మండల కేంద్రంలోనే ఓట్ల లెక్కింపును ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఎక్కువ బెంచీలు ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్సెర్వెర్ లను నియమిస్తామని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని బీసీ మహిళలకు కేటాయించడం జరిగిందని ఒక ప్రశ్నకు బదులుగా జిల్లా కలెక్టర్ తెలిపారు.

హిరమండలంలో జడ్పీటీసీ టిడిపి అభ్యర్థి మరణించారని, ఎంపీటీసీ అభ్యర్థులలో హిరమండలంలో హిరమండలం -3 వైఎస్ఆర్సిపి అభ్యర్థి, కంచిలి మండలం తలతంపర వైఎస్ఆర్సిపి అభ్యర్థి, కంచిలి మండలం కుంబరి నౌగాం టిడిపి అభ్యర్థి, కొత్తూరు మండలం దిమిలి టిడిపి అభ్యర్థి, మందస మండలం పిడి మందస వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, రేగిడి ఆమదాలవలస ఉంగరాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, శ్రీకాకుళం కనుగులవనిపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, పోలాకి మండలం రెహమాన్ పురం టిడిపి అభ్యర్థి, సీతంపేట మండలం సీతంపేట – 2 బిజెపి అభ్యర్థి, వీరఘట్టం మండలం వీరఘట్టం- 3 వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, బూర్జ మండలం బూర్జ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మృతి చెందారని ఆయన తెలిపారు.
ఇచ్చాపురం మండలం లో 15 ఎంపీటీసీలు, కవిటిలో 22, కంచిలిలో 19, సోంపేటలో 23, పలాసలో 10, మందసలో 24, వజ్రపుకొత్తూరులో 21, టెక్కలిలో 21, నందిగాంలో 16, కోటబొమ్మలిలో 21, సంతబొమ్మాలిలో 20, నరసన్నపేటలో 22, జలుమూరులో 17, సారవకోటలో 15, పోలాకిలో 19, పాతపట్నంలో 18, హిరమండలంలో 12, ఎల్.ఎన్.పేటలో 10, కొత్తూరులో 20, మెలియాపుట్టిలో 15, ఆమదాలవలసలో 13, సరుబుజ్జిలిలో 9, బూర్జలో 12, పొందూరులో 21, శ్రీకాకుళంలో 19, గారలో 23, రణస్థలంలో 25, లావేరులో 20, జి.సిగడాంలో 16, ఏచ్చెర్లలో 23, పాలకొండలో 12, వీరఘట్టంలో 19, సీతంపేటలో 16, భామినీలో 13, రాజాంలో 15, సంతకవిటిలో 19, రేగిడి ఆమదాలవలసలో 20, వంగరలో 12 వెరసి 667 ఎం.పి.టి.సి స్థానాలు ఉన్నాయి. వాటిలో 590 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 678 ఎం.పి.టి.సి స్థానాలకుగాను పెదపాడు, పాత్రునివలస, ఖాజీపేట, చాపురం, కిల్లిపాలెం, తోటపాలెం, కుశాలపురం, లొద్దభద్ర, తర్లకోట పంచాయతీలలో 11 ఎం.పి.టి.సి స్థానాలకు మునిసిపాలిటీలలో విలీన ప్రక్రియ కారణంగా నోటిఫికేషన్ జారీ చేయలేదు. 66 స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మరణించగా ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 590 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 2,329 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పోలింగ్ నిర్వహణకు 2,795 మంది పోలింగ్ అధికారులు, 13,974 మంది పోలింగ్ సిబ్బంది అవసరమని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలుపు, గులాబీ రంగు గల మొత్తం 42 లక్షల బ్యాలెట్ పేపర్ లను ఇప్పటికే ముద్రించడం జరిగిందని ఆయన తెలిపారు. అన్ని మండలాలకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాకు 5,776 బ్యాలెట్ బాక్స్ లు అవసరం కాగా ప్రస్తుతం 3,576 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన బ్యాలెట్ బాక్సులను ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ఎన్నికలు సాఫీగా, సక్రమంగా జరుగుటకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని ఆయన పేర్కొంటూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని తదనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.

5న పోలింగ్ సిబ్బందికి శిక్షణ

జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బందికి ఈనెల 5వ తేదీన శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి 5వ తేదీన, కౌంటింగ్ సిబ్బందికి 6వ తేదీన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా హాజరు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. శిక్షణకు హాజరు కాని వారిపై ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కే .శ్రీనివాసులు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టీవీఎస్జి కుమార్ , డిప్యూటీ కలెక్టర్లు బీ శాంతి, కాశీ విశ్వనాధ రావు, పి.అప్పారావు, జిల్లా పరిషత్ సీఈఓ బి లక్ష్మీపతి, డి పి ఓ వి.రవి కుమార్, హౌసింగ్ పీడీ టి వేణుగోపాల్, డ్వామా పిడి హెచ్ .కూర్మా రావు, సి పి ఓ ఎం.మోహన్ రావు, డి.ఎస్.ఒ డి వి రమణ , డీఆర్డీఏ పిడి బి.శాంతి శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement