Tuesday, November 26, 2024

AP: మీడియాపై దాడులు నిరోధించేందుకు ప్రత్యేక చట్టం చేయాలి…

సోంపేట, ఫిబ్రవరి 22 (ప్రభ న్యూస్) : పాత్రికేయులపై దాడుల నిరోధానికి ఒక ప్రత్యేక చట్టం చేయాలని వివిధ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు సోంపేట కంచిలి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సోంపేట తహసీల్దార్ విజయ్ కుమార్ కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు గురువారం సోంపేట కంచిలి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెదుళ్ళ తిరుపతిరావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పాత్రికేయులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ పాత్రికేయులపై దాడులు చేపట్టిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు.

పాత్రికేయులను రాజకీయ పార్టీల కార్యకర్తల మాదిరిగా చూసే ధోరణి నేతల్లో పెరగడం విచారకరమన్నారు. పాత్రికేయులు తమ వృత్తి ధర్మాన్ని నెరవేర్చడానికి వస్తున్నారే తప్ప వారికి యాజమాన్యాల రాజకీయ వైఖరులతో సంపాదకీయ విధానాలతో సంబంధం లేదని, వారిపై దాడులు చేయడం తగదని, ఇలాంటి అవాంఛిత ధోరణులను పౌర సమాజం ఖండించాలని పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణమూర్తి, సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ధి శ్రీనివాసరావు, జాగృతి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడు రామ్ బుడ్డి గణపతి మాస్టారు, సోంపేట లైన్స్ క్లబ్ అధ్యక్షుడు వైశ్యరాజ్. గోపి కిరణ్ తో పాటుగా వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

పాత్రికేయులపై దాడుల నివారణకు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేశాయని, అటువంటి చట్టాన్ని మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని డిమాండ్ చేశారు. దాడుల నివారణకు గతంలో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో హై పవర్ కమిటీలు ఉండేవని, ప్రస్తుత ప్రభుత్వం గత 5సంవత్సరాలుగా వాటిని ఏర్పాటు చేయలేదని, కమిటీలను వెంటనే పునరుద్ధరించాలని సీనియర్ పాత్రికేయులు బత్తుల కామేశ్వరరావు కోరారు. రాప్తాడులో ఫోటో జర్నలిస్ట్ పై జరిగిన అమానుష దాడి, అమరావతిలో విలేఖరిపై జరిగిన దాడి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత రెండు వారాల్లో పలు ప్రాంతాల్లో జరిగిన దాడులు, మొన్నటి రోజున కర్నూలులో ఓ ప‌త్రిక‌ కార్యాలయంపై జరిగిన దాడిని చూస్తే రాష్ట్రంలో పాత్రికేయులకు భద్రత కరువైంద‌ని అర్థం అవుతోందన్నారు.

- Advertisement -

దాడులకు కారకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బెల్లాన సుమన్, మల్ల కృష్ణారావు, సంతోష్ కుమార్, కంచిలి సోంపేట ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాదిన ప్రసాద్, పొట్టి శివకుమార్, రత్నాల శ్రీనివాసరావు, త్రినాధ్ పట్నాయక్ బల్ల. జానకిరావు, కే.రాజేష్, గార రాజేంద్ర, రాంబాబు నరేష్ కుమార్, మహేష్ తో పాటుగా వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement