(ప్రభ న్యూస్ బ్యూరో)శ్రీకాకుళం, : తెలుగుదేశం పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితా గురువారం విడుదల చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలలో మొదటి విడతలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాలవలస, రాజాం నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఆరు నియోజక వర్గాలలో మాజీ ఎమ్మెల్యేలు తమకు టిక్కెట్ ఖరారు అవుతుందా? లేదా అన్నదానిపై కలవర పడ్డారు . శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, పలాస, పాలకొండ నియోజకవర్గం టిక్కెట్లు కచ్చితంగా వస్తాయని ఈ ఆరు నియోజకవర్గాల్లో ప్రస్తుత ఇన్చార్జిలు గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ గురువారం విడుదలైన రెండవ జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కేవలం నరసన్నపేట అభ్యర్థిని మాత్రమే ప్రకటించారు.
నరసన్నపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జ్ బగ్గు రమణమూర్తి వైపే పార్టీ అధినేత మొగ్గుచూపుతూ అతనికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఖరారు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు తన కుమారుడైన వైద్యుడు బగ్గు శ్రీనివాసరావుకు టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధినేతను కోరడంతో మొదటి విడతలో రమణమూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనప్పటికీ రెండో విడతలో మాత్రం రమణ మూర్తికే టిక్కెట్ ఖరారు చేయడం జరిగింది. దీంతో బగ్గు రమణమూర్తి అభిమానులు, అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మరో ఐదు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ పెరుగుతోంది. రెండో జాబితాలో కూడా తమ పేర్లు ప్రకటించకపోవడంపై సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పలాస నియోజకవర్గ ఇన్చార్జ్ గౌతు శిరీష, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ కలమట వెంకటరమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిల అనుచరులు, అభిమానులు పార్టీ పెద్దల తీరుపై కొంత ఆగ్రహంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. టికెట్ల ఖరారు విషయంలో జిల్లాకు చెందిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు రెండు మూడు నియోజకవర్గాల విషయంలో ప్రస్తుతం ఉన్న ఇన్చార్జిలను కాకుండా కొత్త వారి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నందునే ఈ నాలుగు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించలేదని కొందరు మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం లో 2009 నుంచి టీడీపీ రెండు వర్గాల విభేదాల వల్ల పార్టీ ఓడిపోతూవస్తుండటం, ఈసారికి కూడా విబేధాలు అలానే ఉండటం తో అభ్యర్థిని నిర్ణయించడంలో పార్టీ అధినేత వెనుకాడ వలసి వస్తోందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి రెండో జాబితాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో అభ్యర్థులు ప్రకటించకపోవడంతో పార్టీలో విభేదాలకు తావిస్తున్నట్లుగా ఆయా నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు