శ్రీకాకుళం, నవంబర్ 1: జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. మధ్యాహ్నం 12గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈదుపురం చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు బెందాళం అశోక్ తో పాటు జిల్లాకు చెందిన శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, గౌత శిరీష, తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
ఈదుపురం గ్రామంలో పలువురు మహిళలకు చంద్రబాబు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబటి శాంతమ్మ ఇంటిలో చంద్రబాబు నాయుడు స్వయంగా స్టవ్ వెలిగించి, దానిపై గిన్నెపెట్టి పాలు పోసి పాలు కాచారు. దీంతో లబ్ధిదారులు ఎంతో సంబరపడ్డారు. మీరు మా దేవుడు అంటూ శాంతమ్మ ఇతర మహిళలు చెబుతూ రావడంతో చంద్రబాబు స్పందించి నేను కూడా మనిషినే నమ్మా.. మీకు న్యాయం జరిగేలా నేను అన్ని విధాలా కృషి చేస్తానని, అందుకే తాను ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు.
పాలు మరిగిన తర్వాత అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలని ఆయన శాంతమ్మకు చెబుతూనే మరో పక్క ఇందుకు అయిన ఖర్చును రామ్మోహన్ నాయుడు ఇవ్వాలంటూ నవ్వుతూ చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు. అనంతరం ఆయన బహిరంగసభకు బయలుదేరారు.