Friday, November 22, 2024

SriBhagh Agreement – చీకటి చట్టం రద్దుకు ముఖ్యమంత్రి ఉద్యమించాలి – రాయలసీమ సాగునీటి సాధన సమితి

క‌ర్నూలు – రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్. రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై ఎన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ బాగ్ ఒడంబడిక పూర్వపరాలను సమగ్రంగా వివరించారు.
అనంత‌రం బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 70 సంవత్సరాల కాలంలో శ్రీబాగ్ ఒడంబడిక లోని అనేక హక్కులు సాధించినట్లుగా సాధించి తిరిగి పోగొట్టుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా సంఘాలు చేసిన కార్యక్రమాల పర్యవసానంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నాం అని శాసనసభలో ప్రకటించిన విషయం ఆయన ఈ సందర్భంగా గర్తుచేసారు. న్యాయ రాజధాని, న్యాయ సంబంధమైన అనేక కార్యాలయాలను, రాయలసీమ కరువు నివారణ పథకం కింద అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూ శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని పాలకులు ప్రకటనలు చేసిన విషయాన్ని వివరించారు.‌

శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేపడతామని కర్నూలు కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అంతా గత సంవత్సరం డిసెంబర్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని , గత సంవత్సరం నవంబర్ 16 న వై సి పి ఊరూరునా శ్రీబాగ్ ఒడంబడిక దినోత్సవాన్ని నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసారు‌.
కానీ శ్రీబాగ్ ఒడంబడికతో చేపట్టాల్సిన పాలనా వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా విస్మరించి నేడు శ్రీబాగ్ ఒడంబడిక రోజును కూడా పూర్తిగా విస్మరించి, మొఖం చాటు వేసారని దశరథరామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.
వీటిని విస్మరించడంతోపాటుగా గత నెల ఆరో తారీఖున కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రాయలసీమకు తరతరాలుగా ఉన్న నీటి హక్కుల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని తీవ్రంగా విమర్శించారు.
ఈ చట్టం అమలౌతే రాయలసీమలో కృష్ణ నదిలో నీళ్లు ఉన్నప్పటికీ, సాగునీటి హక్కులు హరించుకుపోవడం వలన, ఆకాశం వైపు చూసి జొన్న లేదా కొర్రలో వేసుకోనే దుస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు . ఈ దుస్థితి నుండి బయటపడడానికి ప్రజలు పెద్ద ఎత్తున పాలకులపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ అంశాలపై బాల ఈశ్వర రెడ్డి, పి డి ఎస్ యు రాంబాబు, అడ్వకేట్ శంకరయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాజశేఖర్, వాల్మీకి సంఘం అధ్యక్షులు పులికొండన్న, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆత్మకూరు రవీంద్ర, రాజా విక్రమ్, ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత ఎజిఎం శివనాగి రెడ్డి తదితరులు మాట్లాడుతూ సాగునీటి సాధన సమితి చేపట్టే ప్రత్యక్ష కార్యాచరణ కార్యక్రమాలలో పాల్గొని రాయలసీమ హక్కులను నిలబెట్టడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటిలోకి నెట్టివేస్తున్న కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఉపసంహరణకు ముఖ్యమంత్రి రాజకీయ దౌత్యం చేసి చట్టాన్ని నిలుపదల చేయాలని సభ డిమాండ్ చేసింది. చీకటి చట్టం రద్దుకు ముఖ్యమంత్రి కార్యాచరణ చేపట్టకపోతే సభా అభిప్రాయం మేరకు డిసెంబర్ మొదటి వారం నుండి ప్రతి వారం ఒక్కొక్క మండల కేంద్రంలో రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు.‌

సంతజుటూరు కృష్ణారెడ్డి సభలో తీర్మానాలను ప్రవేశపెట్టారు. సభికుల ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించిన తీర్మానాలను సభికులకు చదివి వినిపించారు. ఈ సమావేశంలో బొజ్జా దశరథరామిరెడ్డి రచించిన ..నీటి అవగాహనే రాయలసీమకు రక్ష..అనే పుస్తకాన్ని నంద్యాల జిల్లా నుండి వచ్చిన రైతులు, రైతు నాయకులు, విద్యార్థి నాయకులు, అనేక ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ బహిరంగ సభకు నంద్యాల జిల్లా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, విద్యార్థులు, నంద్యాల పుర ప్రముఖులు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. సాగునీటి సాధన సమితి కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి వందన సమర్పనతో కార్యక్రమం ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement