Monday, November 25, 2024

Sri Satya Sai District – కరవు నేలలో కుంభవృష్టి

శ్రీ సత్యసాయి జిల్లాలో జోరువాన

ఒకే రోజులో 1745.6 మిల్లీమీటర్ల వర్షపాతం
అత్యధికంగా పుట్టపర్తిలో 112.8 మిల్లీమీటర్లు
అత్యల్పంగా లేపాక్షి మండలంలో 23.6 మిల్లీమీటర్లు
వాగులు.. వంకలు పరవళ్లు
చిత్రావతికి పొంచిన ప్రమాదం

ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీ సత్యసాయి జిల్లా బ్యూరో : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు ఏకంగా 1746.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఏకంగా సగటు వర్షపాతం ఒకే రోజులో 54.7 మిల్లీమీటర్ల వర్షం కురవడం విశేషం. జిల్లాలోని ప్రధాన చెరువులకు వర్షం నీరు చేరుతోంది. చిన్నచిన్న వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.

- Advertisement -

ప్రధానంగా కర్ణాటకలోని పరగోడు డ్యాం భారీ వర్షాలకు 80 శాతం పైగా నీరు చేరడంతో కర్ణాటకలో ఇక ఏమాత్రం వర్షాలు కురిసిన పరగోడు పొంగి చిత్రావతి నదిలోకి భారీగా వరద చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ టీఎస్ చేతన్ చిత్రావతి నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇసుక కోసం ఎడ్ల బండిలో వెళ్లే వారు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.అనేక చోట్ల చెరువులు నిండి మరవలు వస్తున్న కారణంగా చిన్నపిల్లలు, మహిళలు వాగులు, వంకల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేరకు ఇప్పటికే ఎస్పీ వి.రత్న ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ముందస్తు చర్యలు చేపట్టారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలు కారణంగా పురాతన మిద్దెలు, చెట్లు పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

రికార్డు వర్షపాతం
ఇదిలా ఉండగా జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తచెరువు 110.6 మిల్లీమీటర్లు, బుక్కపట్నం 98.6, పెనుకొండ 90.2, రామగిరి 77.2, చెన్నై కొత్తపల్లి 71.8, ముదిగుబ్బ 71.8 రాప్తాడు 68.6, నల్లమాడ 67.0, గోరంట్ల 66.8, సోమందేపల్లి 61.6, ధర్మవరం 63.4, ఓబుల దేవర చెరువు 59.0, నల్లచెరువు 54.2, అమరాపురం 50.2, గాండ్లపెంట 44.8, కదిరి 44.8 అమడగూరు 42.8, నంబుల పూలకుంట 41.8 తనకల్లు, 40.4, కనగానపల్లె 39.0, మడకశిర 38.4 , పరిగి 34.0 తాడిమర్రి 32.4, బత్తలపల్లి 31.8, చిలమత్తూరు 30.2, హిందూపురం 27.8 ,అగళి26.7, లేపాక్షి 23. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నందికొట్కూరు జ‌ల దిగ్బంధం

రెండు రోజులుగా దంచి కొడుతుండ‌టంతో నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం జలమయమైంది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో హాజీ నగర్, మారుతి నగర్ కాలనీలు నీట మునిగాయి. ఇక ప్రధాన రహదారులపై మోకాలు లోతులో నీరు ప్రవహిస్తోంది. ఇళ్లలోకి వ‌ర‌ద నీరు చేరి ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement