Friday, November 15, 2024

TTD: తిరుమ‌ల‌లో శ్రీరామ న‌వ‌మి వేడుక‌లు..

17న అస్థానం .. ఉద‌యం శ్రీసీతారాముల వారికి తిరుమంజ‌న సేవ
రాత్రికి హ‌నుమంత వాహ‌న సేవ
18న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం
తిరుమ‌ల‌కు వేస‌వి సెల‌వుల ఎఫెక్ట్
పోటెత్తుతున్న భ‌క్త జ‌నం
శ్రీవారి ద‌ర్శ‌నానికి 30గంట‌ల స‌మ‌యం
దివ్య ద‌ర్శానానికీ 7 గంట‌లు నిరీక్ష‌ణ

తిరుమ‌ల – శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17వ తేదీన ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీరాములవారు హనుమంత వాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. భక్తులను కటాక్షిస్తారు. అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా శ్రీరామ నవమి రోజున సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఇక 18వ తేదీన రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి వద్ద శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు.


శ్రీవారి ద‌ర్శ‌నానికి 30గంట‌లు స‌మ‌యం…
విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. విశేష సంఖ్యలో వస్తున్న భక్తులు దివ్య దర్శన టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని అపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని అన్ని షెడ్లు భక్తులతో నిండి క్యూలైన్‌ ఏటీజీహెచ్‌ అతిథి గృహం వరకు వ్యాపించి ఉంది. మరో రెండు వారాలు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం క్యూలైన్‌లో భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతున్నది. క్యూలైన్‌లో వేచియున్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదం, పాలు, మజ్జిగ అందిస్తున్నది. శ్రీవారి మెట్లమార్గంలో రోజుకు ఇచ్చే 5 వేల టో కెన్స్‌ అయిపోవడంతో భక్తులకు నిరీక్షణ తప్పలేదు. టైమ్‌స్లాట్‌, కాలినడక వచ్చే దివ్య దర్శనం భక్తులకు సుమారు 7 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు సుమారు 5గంటల సమయం పడుతున్నది. ఈనెల 17వ తేదీన శ్రీరామనవమి. ఈ పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. రోజువారీ కంటే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున.. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలను తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement