తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిలో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీని వైద్యబృందం గురువారం విజయవంతంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన బాలిక కవితకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్లు గుండెకు ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చడంతోపాటు ఇన్‌ఫెక్షన్ తొలగించడానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుని గురువారం ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం నాలుగు గంటల పాటు శ్రమించి బాలికకు ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం బాలిక ఐసియులో వైద్యసేవలు పొందుతోంది.
ఆసుపత్రిలో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి సుబ్రమణ్యం, డాక్టర్ అశోక్, డాక్టర్ విజిత, డాక్టర్ మధు యాదవ్ బృందాన్ని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే నెలకు 100 సర్జరీలు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.