తిరుమల, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పల పై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. రాత్రి 7నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు.
వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. మూడవ రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీ ధుల్లో ఊరేగిన తర్వాత కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్న జీయర్ స్వామి, ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటి ఈవో రమేష్‌బాబు, పేష్కార్ శ్రీహరి, విజివో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.