తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించి ఎంతోమందికి దైవంలా నిలిచారు ఎన్టీఆర్. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి అలాంటిది.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాం నివాళులర్పించారు. గురువారం వేకువజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. అలాగే పలు ప్రముఖులు కూడా నివాళ్లర్పించేందుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించడానికి వచ్చిన వేళ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు కూడా భారీగా వచ్చారు. ఎన్టీఆర్ చుట్టూ అభిమానులు గుమిగూడారు. బౌన్సర్లు ఉన్నా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.