రాజకీయ చదరంగంలో.. ప్రత్యర్థి శక్తి, యుక్తి నిర్వీర్యమే ప్రధాన వ్యూహం. తొలుత ఆర్థిక మూలం ధ్వంసం చేయటం. భటులకు ఎర వేసి.. రెండు శకటాలు, రెండు గుర్రాలను రంగంలోకి దించి.. పద్మవ్యూహం వలయంలో ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆత్మరక్షణకు అవకాశం లేకుండా నిరంతర దాడితో.. ప్రత్యర్థిని మట్టి కరిపించటమే రాజకీయ నీతి. ఏపీ రాజకీయ సమరంలో విజయమా? వీరస్వర్గమా? అనే రీతిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో కదం తొక్కుతున్నాయి. ఈ తరుణంలో శత్రువు దుర్భేద్య కోటల విధ్వంసమే లక్ష్యంగా అధికార పార్టీ తన బలగాలను మొహరిస్తోంది. ప్రధానంగా బీసీ పావులను ప్రయోగిస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ కుప్పం, మంగళగిరి, మైలవరం, హిందూపురం, టెక్కలి సెగ్మెంట్లపై ప్రత్యేక వ్యూహం అమలు చేస్తోంది.
తెలుగుదేశం కంచుకోటల్లోనే కాదు.. కీలక నేతల నియోజకవర్గాలపైనా తన బలగాలను ప్రయోగిస్తోంది. ఈ సీట్లలో ప్రత్యర్థుల్ని మట్టి కరిపించేందుకు సామ, దాన, దండోపాయలన్నింటినీ సిద్ధం చేస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోటీ చేసే కుప్పం సెగ్మెంట్, ఆయన కుమారుడు లోకేశ్ బరిలో ఉండే మంగళగిరి, బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సెగ్మెంట్ టెక్కలిపై, సీఎం జగన్‌పై నిత్యం నోరుపారేసుకునే దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేసే మైలవరం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
నెంబర్ వన్ టార్గెట్ కుప్పంవైసీపీ టార్గెట్ చేసిన ఈ అయిదు నియోజకవర్గాల బాధ్యతలను పార్టీలోని ఇద్దరు కీలక నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు పోటీ చేసే కుప్పం నియోజకవర్గం బాధ్యతలను చంద్రబాబు చిరకాల రాజకీయ ప్రత్యర్థి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సొంత నియోజకవర్గం కన్నా కుప్పంపైనే పెద్దిరెడ్డి ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నేతలను కనీసం నామినేషన్లను కూడా వేయనీయకుండా అడ్డుకున్నారు. 1989నుంచి అప్రతిహాతంగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ అధినేత జగన్ ప్రధాన కోరిక. ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు సహా పంచాయతీలు, జెడ్పీటీసీలను వైసీపీ పెద్దసంఖ్యలో కైవసం చేసుకుంది. చంద్రబాబును తన సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకునే యత్నం చేశారంటే.. ఈసీటుపై ఎంత కసితో ఉందో తెలుస్తోంది. ఎప్పుడూ లేనంతంగా చంద్రబాబు సైతం పదేపదే కుప్పంలో పర్యటించి శ్రేణులకు భరోసా ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.
లోకేశ్ కు మంగళమే లక్ష్యంతెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేసే మంగళగిరిలో మరోసారి పాగా వేయాలని సీఎం జగన్ పట్టుదలతో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములను డిసైడ్ చేసే చేనేత కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ఏడాది ముందు నుంచే యత్నాలు ప్రారంభించారు. ఆ సామాజిక వర్గంలో కీలక నేత గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. పార్టీలో నెంబర్ 2గా పేరొందిన విజయసాయిరెడ్డికి మంగళగిరిలో గెలుపు బాధ్యతలు అప్పగించారు. లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే సమయంలో వైసీపీ లీడర్లు అక్కడ పనులు మెల్లగా చక్కబెడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన లోకేశ్ తక్షమే అప్రమత్తయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.
హిందూపురం.. బాలయ్యకు దూరంఅనంతపురం జిల్లాలో తెలుగుదేశం కంచుకోట హిందూపురం బద్దలు కొట్టే బాధ్యతలు కూడా పెద్దిరెడ్డికే అప్పగించారు. అందుకే పెద్దిరెడ్డి బెంగళూరు నుంచి దీపికారెడ్డిని హిందూపురం ఇన్చార్జ్గా తీసుకొచ్చారు. ఆమె గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రేయింబవళ్లు అక్కడే మకాం వేశారు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా వాల్మీకి, బోయ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన బళ్లారి మాజీ ఎంపీ శాంతమ్మను తీసుకొచ్చారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అసమ్మతి వర్గాన్ని ఏక తాటిపైకి తెచ్చే యత్నాలు చేస్తున్నారు. నందమూరి కుటుంబానికి అనుకూలంగా ఉన్న ఈ నియోజక వర్గంలో ఈ సారి మహిళా కార్డు ప్రయోగించి.. ఓట్లు కొల్లగొట్టడానికి పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో పెద్దిరెడ్డి పర్యటించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వైసీపీ సీనియర్ నేత నవీన్ నిశ్చల్‌ను కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా కృషి చేశారు. తెలుగుదేశంలోని అసమ్మతి వర్గాన్ని చేరదీస్తున్నట్లు తెలుస్తోంది. మరి వైసీపీ యత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో? అని రాజకీయ పరిశీలకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
టెక్కలి, మైలవరాన్నీ వీడలే ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలి, దేవినేని ఉమా మహేశ్వరరావు పోటీచేస్తున్న మైలవరం నియోజక వర్గాల్లో బీసీ కార్డుతో టీడీపీని కకావికలం చేస్తున్నారు. మైలవరంలో స్థానికత, బీసీ కార్డును ప్రయోగించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు పొగపెట్టారు. స్థానిక జెడ్పీటీసీ సర్నాల సత్యనారాయణను రంగంలోకి దించారు. సామాన్యుడు, బీసీ నాయకుడు, లోకల్ హీరో.. ఇవీ వైసీపీ అభ్యర్థికి అర్హతలుగా మారాయి. వైసీపీపై ఆగ్రహంతో బయటకు వచ్చిన ఎమ్మెల్యే టీడీపీ రూట్ ను ఎంచుకున్నారు. అంతే అతడికి సీటు ఇస్తే.. దేవినేనికి దెబ్బతప్పదనే వాదన ఉంది. వన్‌షాట్ టూ బర్డ్స్ స్థాయిలో వైసీపీకి లబ్ధి చేకూరుతుంది.
ఇలా టీడీపీ కంచు కోటలపై వైసీపీ అటాక్ మొదలెట్టింది. మరి రాజకీయాల్లో సీనియర్ అయిన చంద్రబాబు ఈ వ్యూహాన్ని ఎలా ఛేదిస్తారు. ఎలా డిఫెన్స్ చేస్తారో అని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ సిచ్యుయేషన్ని బేస్ చేసుకుని పొలిటికల్ అనలిస్టులు చర్చోప చర్చలు చేస్తున్నారు.