Friday, November 22, 2024

SPL Story – – శ్రీ సత్యసాయి జిల్లాకు “అమృత్” వర్షం….

నాలుగు స్టేషన్లకు మహర్దశ
ఇక హైటెక్ హిందూపురం
పుట్టపర్తిలో ప్రశాంత గానం
ధర్మవరానికి గొప్ప యోగం
కదిరిలో అన్నీ కిలకిలరావాలే
యుద్ధ ప్రాతిపదికన పనులు షురూ

ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీ సత్యసాయి బ్యూరో: శ్రీ సత్యసాయి జిల్లాలో నాలుగు రైల్వే స్టేషన్లను అమృత్ వరం దక్కింది. అత్యాధునిక సదుపాయాల వర్షం కురవబోతోంది. ఇక రైల్వే ప్రయాణంలో సర్వసౌకర్యాల క్రతువును రైల్వే శాఖ ప్రారంభిస్తోంది. హిందూపురం, పుట్టపర్తి (ప్రశాంత్ నిలయం), ధర్మవరం, కదిరి రైల్వే స్టేషన్ల అంతా మర్యాదే. సరదా, సరదా ప్రయాణమే. ప్రశాంత జీవనం, సంతోష వేడుకలు ఇక ప్రయాణికుల సొంతమే. శ్రీ సత్యసాయి జిల్లాపై ఆవరిస్తున్న అత్యాధునిక శాస్ర్త సాంకేతిక పరిజ్ఞానంతో దేశ విదేశీ పర్యాటకులకు అలరించనున్నాయి. ఇప్పటికే కదిరి రైల్వే స్టేషన్ లో ఈ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. స్టేషన్ ను అభివృద్ధికి రైల్వే స్టేషన్ చుట్టుపక్కల చెట్లను, పాత నిర్మాణాలను తొలగించి , రైల్వే ఇంజనీరింగ్ విభాగం స్థలాన్ని సైతం స్టేషన్ ఆధునీకరణకు విలీనం చేస్తారు. ఈ అమృత్ వరంతో.. సుందర ఆధునీకరణ రైలు యాత్రా స్థలాల అవసరాన్ని, ఘనతను ఓ సారి పరిశీలిద్దాం.

- Advertisement -

హిందూపురంలో హైటెక్ హిందోళం ..

హిందూపురం పట్టణం జనాభా 2.25 లక్షల మంది. కర్ణాటక, మడకశిర 44 జాతీయ రహదారి దగ్గరగా వెళుతుంది. నిత్యం హిందూపురం నుంచి రైలు ప్రయాణికులే అధికం. ఇంకా హిందూపురం నుంచి బెంగళూరు నగరానికి రోజు వందల మంది కార్మికులు ఉద్యోగులు వెళ్తూ, వస్తూ ఉంటారు. అమృత్ స్టేషన్ కింద ఎంపికైన హిందూపురం రైల్వే స్టేషన్ లో మెరుగైన సౌకర్యాలు, ఆధునిక సదుపాయాలు లభించటం ఖాయమే. . పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న హిందూపురం రైల్వే స్టేషన్ కు ఇన్నాళ్లకు తగిన న్యాయం జరిగిందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇక ప్రశాంత వేడుకలే ..

ప్రశాంత నిలయం పుట్టపర్తి రైల్వే స్టేషన్ ను అమృత్ స్టేషన్ గా ఎంపిక చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వెలసిన పుట్టపర్తి లో ఆయన మహా సమాధి దర్శనార్థం , ప్రశాంత జీవితం కోసం దేశ విదేశాల నుంచి సాయి భక్తులు వందల సంఖ్యలో పుట్టపర్తికి వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా సాయి భక్తులు ఉండగా నిత్యం విదేశీ యాత్రికులతో, భక్తులతో పుట్టపర్తి కళకళలాడుతూ ఉంటుంది. పుట్టపర్తిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలు, సదుపాయాలు, భద్రతా చర్యలు వంటి వాటి వలన భక్తులకు మరింత సౌకర్యంగా ఉండడంతో మరింత ఆదరణ పెరిగి విదేశీ యాత్రికులు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా పుట్టపర్తికి మంచి గుర్తింపుతో పాటు ఇక్కడి వారికి (వ్యాపార వర్గాలకు )ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు.

ధర్మవరం ఇక పెద్ద జంక్షన్

ధర్మవరం జిల్లాలోని ప్రధాన పట్టణాలలో హిందూపురం తర్వాత ధర్మవరం ఒకటి. ఇక్కడ ఒకటిన్నర లక్ష జనాభా ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్లు తర్వాత ధర్మవరం రైల్వే జంక్షన్ పెద్దదే. భవిష్యత్తులో మరిన్ని రైళ్లు పెరిగి స్టేషన్ ప్లాట్ ఫారాల సంఖ్య పెరిగే అవకాశా లు మెండుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అమృత్ స్టేషన్ గా ఎంపికైన ధర్మవరంలో సదుపాయాల అవసరం ఎంతో ఉంది. ఇందుకు అనుగుణంగా అనేక సదుపాయాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిర్మాణాలు చేపట్టడం కలిసి వచ్చే అంశమే.

ఇక కీర్వాణిలా కదిలే.. కదిరి
ఇక కదిరి పట్టణం పలు చారిత్రక అంశాలకు ముఖ్య కేంద్రం. . జనాభాపరంగా చూస్తే 1, 25,000 మంది ఉన్నారు. కదిరి పట్టణానికి సుమారు 10 కి పైగా మండల కేంద్రాలు అతి తక్కువ దూరంలో ఉన్నాయి. ప్రధానంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను సుమారు ఏడు ఎకరాలలో విస్తరించిన మహావృక్షమే ఇందుకు సాక్ష్యం, ఈ చెట్టు కదిరి పట్టణానికి కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 15 కిలోమీటర్ల దూరంలో విశ్వ కవిగా పేరుపొందిన వేమన సమాధి గాండ్లపెంట మండలం కటారుపల్లి లో కలదు. అంతేకాకుండా సుమారు 400 ఏళ్ల చరిత్ర గల ఖాద్రి నరసింహ స్వామి ఆలయం కదిరి పట్టణంలో ఉన్నది. కర్ణాటక నుంచి నిత్యం వేల సంఖ్యలో కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అదేవిధంగా కదిరి పుట్టపర్తి మధ్య కూడా కేవలం 40 కిలోమీటర్ల దూరం ఉంది. కావున భక్తులకు, యాత్రికులకు కదిరి రైల్వే స్టేషన్ ఆధునిక వసతులతో ఏర్పాటు కావడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. ఇదే సందర్భంలో కదిరి మీదుగా మరిన్ని రైలు నడపడం వలన రైల్వే కి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

ఇంతకీ అమృత వరాలేంటీ?
ముఖ్యంగా అమృత్ స్టేషన్ల లో ఆధునిక విశ్రాంతి గదులు, లగేజీ గదులు, పరిశుభ్రత కు ప్రాధాన్యం ఇచ్చే హైజెనిక్ మరుగుదొడ్లు నిర్మాణం ఏర్పాటు చేస్తారు. ఉచితంగా వైఫై అందుబాటులో ఉంటుంది. వివిధ రకాల డివైసెస్ కు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఏటీఎం, బ్యాంకింగ్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. రుచి, శుచి తో కూడిన ఆహారశాలలు, రెస్టారెంట్లు సైతం ఏర్పాటు చేస్తారు. దివ్యాంగుల కోసం వీల్ చైర్లు, వృద్దుల కోసం లిఫ్టులు, విద్యుత్ ఎక్స్ లెటర్స్ సౌకర్యం లభిస్తుంది. ఇంకా ఆధునిక పద్ధతిలో టికెట్ల విక్రయం, విచారణ పద్ధతులు ఏర్పాటు చేస్తారు. అనగా ఏటీఎం క్రెడిట్ కార్డు వంటి వాటితో నేరుగా డిజిటల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

వాహన పార్కింగ్ సైతం ఆధునిక పద్ధతిలో ఉంటుంది. వెహికల్ పార్క్ చేయగానే టోకెన్ వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. తిరిగి వచ్చినప్పుడు ఆటోమేటిక్ వినియోగంతో వాహనాలను తీసుకెళ్లవచ్చు. స్టేషన్ పరిసరాలు పూర్తిగా పచ్చని వాతావరణంతో నిండి ఉండి పూర్తిగా ఆహ్లాదకరంగా మారుస్తారు. నేమ్ బోర్డులను వివిధ అంశాలు తెలిపే బోర్డులను పూర్తిగా ఆధునిక పద్ధతిలో వివిధ భాషల్లో ఏర్పాటు చేస్తారు. స్టేషన్ లోనూ, పరిసరాలలోనూ పూర్తి భద్రతా పరిమాణాలు పాటిస్తారు. మహిళలకు, పురుషులకు వేరువేరుగా విశ్రాంతి గదులు ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తారు. స్టేషన్లో అదేవిధంగా ఆయా గదులు ప్రాంతాలలో ఆధునిక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తారు. మంచి గాలి, వెలుతురు సదుపాయాలు కల్పిస్తారు. ఇలా అమృత్ స్టేషన్లకు మహర్దశ రావడంతో ఆయా ప్రాంతాల పరిధిలోని ప్రయాణికులకు ఒక కొత్త అనుభూతి తథ్యం .

Advertisement

తాజా వార్తలు

Advertisement