ఏపీ శాసనమండలిపై కన్ను
వైసీపీ నీర్వీర్యానికి మాస్టర్ ప్లాన్
ఇప్పటికే అయిదుగురు ఎమ్మెల్సీల క్యూ
మంత్రులతో కొంతమంది రాయబేరాలు
ఇది సక్సెస్ కాకుంటే ప్లాన్ బీ అమలు
మండలి రద్దు చేయాలనే ఆలోచన
కూటమికి అసెంబ్లీలో తిరుగులేని బలం
మండలిలో అయితే కదలలేని నీరసం
ఏపీలో ఎమ్మెల్సీల సంఖ్య 57
ఇందులో వైసీపీ బలగం 42
వీరికి బ్రేక్ వేయడం ఎలా?
తర్జన భర్జనలో ఏపీ ఎన్డీఏ సర్కారు
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎదురులేని విజయాన్ని పొందాయి. భారీ మెజారిటీతో అధికారాన్ని దక్కింది. శాసనసభలో ఏ బిల్లు అయినా సులభంగా పాస్ చేసుకునే బలం కూటమికి ఉంది. ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన వైసీపీ దారుణ పరాభవంతో 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కనీసం పత్రిపక్ష హోదా కూడా దక్కే చాన్స్ లేదు. అసలు అగ్రనేత అసెంబ్లీకి వస్తారో? రారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ.. అందరూ ఊహించినట్టు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి దూరం కారు. ఎందుకంటే శాసనమండలిలో వైసీపీకే మెజారిటీ బలం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లులకు మండలిలో ఆమోదం తప్పనిసరి. అంతే కాదు.. ప్రభుత్వ వ్యయాన్నీ మండలి ఆమోదించాలి. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలిలో అధికార పక్షానికి మెజారిటీ బలం చాలా అవసరం ఉంటుంది..
ఇక్కడ జగన్‌దే జమానా
ఏపీ శాసన మండలిలో మొత్తం 60 స్థానాలుంటే.. 20 మందిని ఎమ్మెల్యే కోటాలో.. 20 మందిని స్థానిక సంస్థల కోటాలో, అయిదుగురు పట్టభ్రదులు, అయిదుగురు ఉపాధ్యాయులు, 8 మందిని గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తారు. అంటే ఏపీ మండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలుంటారు. ప్రస్తుతం 42 మంది వైసీపీ ఎమ్మెల్సీలు , 9 మంది టీడీపీ, ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు పీడీఎఫ్ సభ్యులు, ఒకరు జనసేన ఎమ్మెల్సీ కలిపి 57 మంది అందుబాటులో ఉన్నారు. ఈ స్థితిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మండలిలో ఎదురు దెబ్బ తప్పదు. ఇక.. ఈ కూటమికి రెండే రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి వైసీపీ గూటికి గండి కొట్టటం. రెండు ఏకంగా శాసనమండలిని రద్దు చేయటం. ప్రస్తుతం కూటమి కన్ను వైసీపీ శిబిరంపై పడింది. ఎమ్మెల్సీలకు .. బిస్కెట్లు ఎర వేస్తుంటే.. మరి కొందరు ఇక్కడ లాభం లేదనే ధ్యాసలో కూటమికి క్యూ కడుతున్నట్టు ప్రచారం జరగుతోంది.
పెద్దలకు తాయిలాలు
శాసనమండలిలో బలం పెంచుకోవటం కూటమి సర్కారుకు అనివార్యం. అందుకే.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పలువురు వైసీపీ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటు టీడీపీ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లు అధికారం ఉన్నప్పటికీ తమను కనీసం పట్టించుకోలేదన్న భావన చాలా మంది వైసీపీ ఎమ్మెల్సీలను వేధిస్తోంది. ఏ ప్రజా సమస్యను అధినేతకే కాదు.. కనీసం మంత్రుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం దక్కలేదు. కోటరీ చుట్టూ తిరిగే బలం లేక.. చాలా అసంతృప్తితో ఎమ్మెల్సీలు దిగాలుగా ఉన్నారు. 2027 వరకూ కొందరు, 2029 వరకూ మరి కొందరు ఎమ్మెల్సీలుగా కొనసాగుతారు. ఈ లోపు తాము ఫలానా పని చేయించామని ప్రజలకు చెప్సే అవకాశమే లేదు. అధికారంలో వైసీపీ అధినేత పట్టించుకోలేదు, ప్రస్తుత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే లభించే ప్రయోజనమూ ఉండదు. అందుకే ఇల్లు ఉండగానే సరిదిద్దుకునే ప్రయత్నంలో పెద్దలు సర్దుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటువంటి వారిపైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి చేర్చుకునేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్యూలో అయిదుగురు మెంబర్స్..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా ఉన్నప్పటికీ కనీసం గౌరవం, గుర్తింపు దక్కకపోవడం పట్ల అవమాన భారంతో ఉన్న పలువురు ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సంసిద్ధులవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా టీడీపీలో చేరేందుకు రాయబారాలను పంపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు ఈ మేరకు ప్రయత్నాలు చేశారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అయిదుగురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, మంత్రులను కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ ఇటీవల రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఉద్ధరించామన్నట్టుగా చూశారని ఓ ఎమ్మెల్సీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అధికారంలో ఉన్నంతకాలం జగన్ తమతో ఒక్కసారి కూడా ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడిన దాఖలాలు లేవని అసంతృప్త ఎమ్మెల్సీలు ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మాత్రమే జగన్ తమతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇప్పుడు కూడా తమ అవసరం వచ్చింది కాబట్టి పిలిచారని, అది కూడా తమ గురించి కాకుండా మండలిలో తన కోసం నిలబడాలని చెప్పినట్లు పలువురు ఎమ్మెల్సీలు వ్యాఖ్యానిస్తున్నారు.
అదే బాటలో మరి కొందరు
ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్సీలు తమకు తెలిసిన మంత్రుల ద్వారా టీడీపీలో చేరేందుకు రాయబారాలు నెరపుతున్నారు. ఇదే ఆలోచనలో మరింత మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు చెబుతున్నారు. కొంతమంది టీడీపీ మంత్రుల ద్వారా పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారు. మరి కొంతమంది వచ్చి కలుస్తామంటూ మంత్రులకు వర్తమానాన్ని పంపిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మద్దతుతో గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో కూడా ఇద్దరూ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గడిచిన అయిదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించిన, ఇబ్బందులకు గురి చేసిన వారి విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటువంటి నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు కూడా ఆసక్తి చూపించడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థితిలో శాసన మండలిలో కూటమికి బలం పెరగటం అసాధ్యమే. ఇక ప్లాన్ బీ శాసన మండలిని రద్దు చేయటం. పార్లమెంటులోనూ కూటమికి తిరుగులేదు. అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించే అవకాశం ఉందని గత చరిత్రే చెబుతోంది.
ఎన్టీఆర్ హయాంలోనే…
1980వ దశకంలో, ఎగువ సభలను రద్దు చేయాలని కోరిన రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది ప్రజా ప్రాతినిధ్యం లేనిదని, రాష్ట్ర బడ్జెట్ పై భారమని, చట్టం ఆమోదించడంలో జాప్యాలకు కారణమనే విమర్శలతో రద్దు చేయటానికి నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగానే రద్దు తీర్మానాన్ని అసంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏదేమైనా అప్పటి పాలక పార్టీ తెలుగుదేశం రాజకీయ ప్రతిపక్షమైన భారత జాతీయ కాంగ్రెసుకు శాసన మండలిలో ఎక్కువ సీట్లు ఉండటంవల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు చట్టాలు అవ్వడానికి ఆలస్యం జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ విధానసభ ఆమోదించి పంపిన తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు 1985 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (రద్దు) చట్టం ప్రకారం విధాన పరిషత్‌ను రద్దు చేసింది.
వైఎస్ఆర్ ప్రాణం..
1989 లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ (ఐ) ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శాసన మండలిని పునరుద్ధరించడానికి తదుపరి ప్రయత్నాలు ప్రారంభించాడు. శాసన మండలిని పునరుద్ధరించడానికి ఒక తీర్మానం 1990 జనవరి 22 న విధానసభలో ఆమోదించింది. 1990 మే 28 న రాష్ట్ర విధానసభ (అసంబ్లీ) తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు ఎగువ సభ (రాజ్యసభ) లో శాసన మండలి పునరుద్ధరణకు అధికారమిచ్చిన శాసనం ఆమోదం పొంది దిగువ సభైన లోక్‌సభ ఆమోదానికి పంపబడింది. కానీ అర్ధంతరంగా 1991 లో లోక్‌సభ రద్దు కావటంతో ఈ బిల్లు నిలిచిపోయింది. తరువాత వచ్చిన లోక్‌సభలు (1991–1996, 1996–1998, 1998–2004) ఈ విషయంపై ఎలాంటి చర్యా తీసుకోలేదు.2004 ఆంధ్రపదేశ్ రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, కాంగ్రెస్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ 2004 జూలై 8 న శాసన మండలి పునరుద్ధరణకు అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి నేతృత్వంలో మరొక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. కేంద్రం ప్రభుత్వం 2004 డిసెంబరు 16 న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2006 డిసెంబరు 15 న లోక్‌సభ ఆమోదం, డిసెంబరు 20 న రాజ్యసభ ఆమోదం పొంది, 2007 జనవరి 10 న రాష్ట్రపతి ఆమోదం పొందింది.
జగన్ విపల యత్నం
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన రెండు బిల్లులను అసంబ్లీ ఆమోదించిన తర్వాత, శాసనమండలి నిశితమైన పరిశీలన కొరకు సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకించిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం శాసనసభలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం పై చర్చకు టీడీపీ హాజరుకాలేదు. జనసేన శాసనసభ్యుడు అంగీకారం తెలిపారు. దీనితో 133.. -0 ఆధిక్యంతో ఆమోదం పొందింది (మామూలుగా హాజరైన సభ్యులలో యాభై శాతానికి మించి ఆమోదిస్తే సరిపోతుంది). ఈ బిల్లును కేంద్రం పెండింగ్ లో ఉంచింది. 2021 లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంది. మరి ప్రస్తుతం ఎన్డీయే నేతలు ఏం చేస్తారు? పెద్దలను గోడ దూకిస్తారా? శాసన మండలిని రద్దు చేస్తారా? ఇదీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఓ పెద్ద మిస్టరీ.