Friday, November 22, 2024

SPL Story – అన్నా, చెల్లి సవాల్ .!వైఎస్సార్ జయంతే వేదిక

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఉభయ ఆంధ్రప్రదేశ్ లో … కాంగ్రెస్ పార్టీకి అచంచల రథసారధి.. పేదల గుండె సవ్వడి డాక్డర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి రేపు జరగబోతోంది. ఆయన రాజకీయ చతురతను, సామాజిక బాధ్యతను ఈ సందర్భంగా నెమరు వేసుకోని జనం ఉండరు. సమాజం ఆరోగ్యం, విద్య , సంక్షేమే కాదు.. రాష్ట్ర అభివృద్ధికి జలయజ్ఞం నిర్వహించిన అపర భగీరథుడిగా .. జనం స్మరించుకునే వేళ… ఏపీ లో దివంగత వైఎస్ ఆర్ బిడ్డల మధ్య మళ్లీ వారసత్వ పోరు వేడి వేడి సాగుతోంది. పోటాపోటీగా ఆయన జయంతి వేడుకలు.. నిర్వహించడానికి అన్నాచెల్లి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎన్నికలు ముగిసినా వైఎస్ఆర్ వారసుల మధ్య పోరుమాత్రం ఆగడం లేదు.

పుట్టినింటిలో అన్న…బెజవాడలో చెల్లి

కాంగ్రెస్ ఓటు బ్యాంకు పునాదులపై ఏర్పడిన వైసీపీ ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది. ఎంతటివిజయం సాధించిందో.. అంతే చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పుడు వైసీపీ, కాంగ్రెస్‌లను నిలబెట్టుకునే బాధ్యత ఆ అన్నాచెల్లెలపైనే ఉండటంతో వైఎస్‌ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి జులై 8. ఇప్పటి వ‌ర‌కు అటు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల‌.. ఇటు వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్‌.. ఎవ‌రికి వారు ఇడుపుల పాయ వెళ్లి.. వైఎస్‌కు నివాళి అర్పించేవారు. అయితే ఈ సారివైఎస్ జ‌యంతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. మరోవైపు ఓటమి నైరాశ్యంలో ఉన్న వైసీపీ సైతం.. ఈ విషయంలో తగ్గేదేలేదంటోంది. ఈ సారి జరిగేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. సంక్షోభంలోని కాంగ్రెస్‌ను వరుసగా రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్‌ఆర్‌.. తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, 108 వంటి సేవల పేరు చెబితే ముందుగా గుర్తుకువచ్చేది ఆయన పేరే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే.. దురదృష్టవశాత్తూ.. 2009 సెప్టెంబరు 2 హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్‌ మరణించారు.

వైఎస్ఆర్ బిడ్డగా అలా ఎదిగి ..

వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. తండ్రి మరణం తర్వాత తనను సీఎంని చేయలేదని కాంగ్రెస్‌తో విభేదించి బయటకు వచ్చారు. అనంతరం తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. 2014ఎన్నికల్లో పరాజయం పాలైన ఆయన 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఏపీ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో 151 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టారు.జగన్ బలపడిన సమయంలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మెల్లగా అంతరించిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరు నచ్చని ప్రజలు వైసీపీ వైపు మొగ్గారు. ఇప్పటికీ జగన్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీదే.. ఎవరు ఔనన్నా కాదన్నా.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పునాదులపైనే వైసీపీ నిలబడగలిగింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మొన్నటి వరకూ బలంగా కనిపించిన జగన్ పార్టీ..ఇప్పుడు అత్యంత బలహీనంగా తయారైంది. రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోని రీతిలో 11 సీట్లకే పరిమితమయింది.

- Advertisement -

కాంగ్రెస్ లోనూ చలనం

ఈ ఎన్నికల్లో దారుణంగా వైసీపీ కూలపడటంతో ఏపీలో కాంగ్రెస్ పార్గీలో చలనం వచ్చింది. ఏపీ బలపడే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించిన షర్మిల ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. షర్మిల పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి దారుణ ఓటమే ఎదురయింది. గతంతో పోలిస్తే ఓటింగ్‌ శాతం పెరిగినా.. సీట్లు మాత్రం రాలేదు.అయినా వెనకడుగు వేయని షర్మిల 2029 ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుండే బలోపేతం చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.

నాన్న జయంతే… ఆమె అస్ట్రమా?

ఏపీలో కాంగ్రెస్జవసత్వాలనుచైతన్యపర్చేందుకు వైఎస్‌జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి దాకా వైఎస్ వారసత్వాన్ని, ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకున్న జగన్‌కు..ఇకపై గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. వైఎస్ తనయగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చే బాధ్యతను తలకెత్తుకుని కృషి చేస్తున్నారు.ఆ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ నుంచి వైఎస్ అభిమానులను గతంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను తిరిగి హస్తం వైపు తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. బెజవాడ వేదికగా… జులై 8న విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు.

ఈ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వంటి కీలక నేతలను స్వయంగా ఆహ్వానించారు. అటు పులివెందులలో కోట్లాది రూపాయలతో తండ్రి విగ్రహాలు ఏర్పాటు చేయించిన జగన్ అక్కడ కార్యక్రమం నిర్వహించనున్నారు. మరి వైఎస్ అభిమానులు వారిలో ఎవరిని నిజమైన వారసులుగా చూస్తారో?వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement