Tuesday, November 26, 2024

Spl Story – జిల్లాల‌లో వైఎస్ఆర్ సిపి జ‌య‌హో….వారానికో జ‌గ‌న్ స‌భ‌…

అమరావతి, ఆంధ్రప్రభ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ ఓటు బ్యాంక్‌ను పదిలం చేసుకునేందుకు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహరచన చేస్తోంది.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించి బీసీ కులాల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలు, పరిష్కారాలు, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు.. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకుంటూ అందుకు తగిన మేనిఫెస్టో రూపకల్పన చేయాలనే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే జయహో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సభలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్లు పూర్తి స్థాయిలో తమ వెంటే ఉంటే అనుకున్న సీట్లు సాధించాలనేదే సీఎం జగన్‌ వ్యూహంగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన యాత్రల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మూడు భారీ సమ్మేళనాలు ఏర్పాటుచేసి అణగారిన వర్గాలను జాగృతం చేయటం ద్వారా చెక్‌పెట్టాలని భావిస్తున్నారు. వారానికో సభ చొప్పున మూడు వారాల్లో జయహో కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ ముఖ్యనేతలను ఆదేశించినట్లు సమాచారం. తూర్పుగోదావరి లేదా కాకినాడలో జయహో ఎస్సీ, మైనారిటీలు అధికంగా ఉన్న కడపలో జయహో మైనారిటీ, గిరిజన,ఆదివాసీ ప్రాంతాలకు కేంద్రబిందువుగా ఉన్న విశాఖపట్నంలో జయహో ఎస్టీ సభలు నిర్వహించనున్నారు. ఈ మూడింటిని విజయవాడలోనే నిర్వహి స్తే ముఖ్యమంత్రి జగన్‌ హాజరయ్యేందుకు అనువుగా ఉంటుందని కూడా పార్టీ వర్గాలు పరిశీలన జరుపుతున్నాయి.

తెలుగు దేశం పార్టీ కుల సమావేశాలు నిర్వహించడంతో పాటు మరో ప్రతిపక్షం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 34 సీట్లలో ఒక్కటి కూడా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు రానివ్వద్దని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాపులు అధికంగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో జనసేన ప్రభావాన్ని అంచనా వేస్తూ ఒకవేళ కొద్దో గొప్పో ఓట్లు చీలితే ఆ లోటును ఇతర వర్గాలతో భర్తీ చేయాలనేది అధికార పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. అంతేకాదు కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలను ఎందుకు కొనసాగించేదీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమ్మేళ నాల్లో వివరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తున్నామని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయంగా వైసీపీపై చేసిన విమర్శలను ఆయా వర్గాలకు మరోసారి గుర్తుచేయటంతో పాటు భవిష్యత్తులో తమ ఒంటరి పోరుకు సంపూర్ణ మద్దతుపలకాలని కోరనున్నట్లు తెలియవచ్చింది.

రాజకీయ పరమైన అంశాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, మైనారిటీలకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని ఆయా వర్గాల అభ్యున్నతికి అవసరమైన భవిష్యత్‌ కార్యక్రమాలను నిర్దేశించుకుని ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒకానొకప్పుడు పట్టుకొమ్మగా ఉన్న బీసీలకూ 56 కార్పొరేషన్ల ఏర్పాటు తో పాటు భవిష్యత్తులో వారి సమస్యల పరిష్కరించేందుకు గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో విజయవాడలో జయహో బీసీ సమావేశం నిర్వహించిన సంగతి విదితమే. బీసీ సభ సక్సెస్‌ కావటంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు పార్టీకి అండగా ఉన్నారని చాటిచెప్పనున్నారు. సభలు విజయవాడ వేదికగా నిర్వహించాలా? ప్రాంతాల వారీగా జరిపితే మంచిదా అనే అంశాన్ని పార్టీ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నారు. విజయవాడలో నిర్వహిస్తే ముఖ్యమంత్రి జగన్‌ రాకకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రతిపక్ష యాత్రల నేపథ్యంలో జిల్లాల్లో నిర్వహి స్తే అన్నిరకాల కలిసొస్తుందని పార్టీలోని మరికొందరు ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు. దీనిపై నేడో, రేపో సీఎం జగన్‌ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి షెడ్యూూల్‌ ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఒక్కో సభను వారం వ్యవధిలో త్వరతిగతిన పూర్తిచేయాలని సీఎం జగన్‌ పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement