తిరుపతి, ఆంధ్రప్రభ (రాయలసీమ బ్యూరో ) : తిరుమల దివ్య క్షేత్ర పవిత్రతను పరిరక్షించే కోణంలో ఆధ్యాత్మికతను ప్రతిబింబించే సమగ్ర ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారి శ్యామల రావు ప్రకటించారు. గురువారం సాయంత్రం స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆ వ్యవస్థ అయిదేళ్ల క్రితం నాటి తిరుమల అభివృద్ధి ప్రణాళిక ప్రతిపాదనకు ఆధునిక రూపంలో ఉంటుందని చెప్పారు. తిరుమల విషయంలో తొలి నుంచి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన తరువాత పర్యవేక్షించే విధానం కొరతగా ఉందని గుర్తించామన్నారు. అందుకే నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో కొన్ని నిర్మాణాలు జరిగేందుకు వీలు కలిగినట్టు స్పష్ఠమైందన్నారు.
మరోవైపు భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా నిర్మాణాత్మకమైన ప్రణాళిక లేకుండా పోయిందన్నారు. 2019లో తిరుపతి అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో భాగంగా చేసిన ప్రయత్నంలో లీ అసోసియేట్ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా తిరుమల కోసం ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కృషి జరిగిందన్నారు. అయితే ఆ ప్లాన్ గురించి సరైన సమాచారం లేకపోవడంతో ఆనాటి కన్సల్టెన్సీ వారితో సంప్రదించి కొన్ని వివరాలను సేకరించినట్టు తెలిపారు. అందులో చాలావరకు 2017నాటి పరిస్థితులు ప్రతిబింభించే విధంగానే అంశాలు ఉన్నాయన్నారు. కనుక ఆ ప్లాన్ కు ఇప్పటి పరిస్థితికి, వచ్చే 25ఏళ్ల అవసరాలకు తగినవిధంగా ఆధునీకరించి పునర్నిర్మించాలని ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందని తెలిపారు.
ఆ నిర్ణయానికి అనుగుణంగా తిరుమల క్షేత్రాన్ని ఆధ్యాత్మికత కోణంలో భావి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం సంబంధిత రంగంలో నిపుణులైన ఒక సీనియర్ అధికారిని ఎంపిక చేశామని ఆయన ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్ మెంట్ ప్లానింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రాబోయే రెండునెలల్లో ఆ వ్యవస్థ ద్వారా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని బోర్డులో చర్చించి అమలు చేస్తామని తెలిపారు. మరో ఆరు నెలల్లో ఆ డాక్యుమెంట్ అమలుకు తెచ్చే ముందు, దానిలోని అంశాలపై సమగ్ర అధ్యయనం, సంబంధిత వర్గాలతో సమీక్ష, అభిప్రాయ సేకరణ వంటి చర్యలు ఉంటాయని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు చేపట్టిన మఠాల నిర్మాణాలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. ఇంకా మౌలికంగా తిరుమలలో పార్కింగ్ సమస్య, బాలాజీ బస్టాండ్ తరలింపు, వ్యక్తుల పేర్లతో ఉన్న అధితి గృహాల పేర్ల మార్పు, మఠాల, అధితి గృహాల నిర్మాణాల, పరిధుల పున: సమీక్ష, ప్రత్యేక చెత్త నిర్వహణ వ్యవస్థ నిర్మాణం వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. చేపట్టిన, చేపట్టే నిర్మాణాలు ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
అలిపిరి వద్ద ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుకు అధ్యయనం…
అలాగే తిరుమల క్షేత్రం 11మైళ్ళ చదరపు విస్తీర్ణం కలిగి ఉన్నా 1.16 చదరపు మైళ్ళ పరిధి మాత్రమే వినియోగంలో ఉందన్నారు. కనుక పెరిగే భక్తులకు పూర్తి స్థాయిలో అన్ని వసతి సౌకర్యాలు కష్టతరం అవుతోందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని అలిపిరి వద్ద భక్తులకు తాత్కాలిక వసతి వ్యవస్థను ఏర్పాటు చేసి సమయానికి దర్శనానికి తిరుమలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలనే అంశం పై అధ్యయనం చేయనున్నట్టు కూడా శ్యామలరావు తెలిపారు.