Saturday, November 23, 2024

కొత్త జిల్లాల ఏర్పాటు స్పీడప్, రేపటితో ఉద్యోగుల విభజన పూర్తి.. భవనాల రిపేర్లకు రూ.39 కోట్లు

అమరావతి, ఆంధ్రప్రభ: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఉగాది నుంచే పాలన ప్రారంభించాలనే సీఎం జగన్మోహన రెడ్డి ఆదేశాల నేసధ్యంలో అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కొత్త జిల్లాల్లో పాలనా కార్యాలయాల ఎంపిక, మౌళిక సదుపాయాల కల్పనకు క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఉద్యోగుల విభజన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగుల విభజన అంశంపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ అధ్యక్షతన జిల్లాల పునర్విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సబ్‌ కమిటీల సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు గత నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలకు అవకాశం ఇవ్వగా 12వేల అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. వీటిని పరిశీలిస్తూనే..జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. కొత్త జిల్లాల కార్యాలయాల ఏర్పాటుపై అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. వీలైనన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలనే కొత్త జిల్లాల పాలనా కేంద్రాలుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ భవనాల లభ్యత లేనిచోట ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై కూడా సోమవారం నాటి సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

కొనుగోళ్లపై 18లోగా నివేదికలు..

కొత్త జిల్లాల కోసం గుర్తించిన ప్రభుత్వ కార్యాలయాల్లో మౌళిక సదుపాయాలు, అందుబాటులోని ఫర్నిచర్‌, కంప్యూటర్లు, భవనాలకు తుది మెరుగులు దిద్దడం, సివిల్‌, విద్యుత్‌ పనులపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షిస్తున్నారు. పలు జిల్లాల్లో గుర్తించిన భవనాలను ఒకటికి రెండుసార్లు జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం ఇప్పటికే పరిశీలించారు. ఆయా భవనాల్లో కొనుగోలు అవసరమైన వాటిని 18వ తేదీ లోగా జిల్లా కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం పేర్కొంది. జిల్లా కలెక్టర్ల నివేదిక ఆధారంగా కొనుగోళ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఇందుకోసం ఐటీ విభాగానికి ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లా కలెక్టర్ల కార్యాలయాల మరమ్మతులకు రూ.39 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సివిల్‌, విద్యుత్‌ పనులకు జిల్లాకు రూ.కోటి, జిల్లా, డివిజన్‌ స్థాయి కార్యాలయాల్లో ఫర్నిచర్‌ కొనుగోళ్లకు రూ.రెండేసి కోట్ల చొప్పున ఒక్కొక్క జిల్లాకు కేటాయించింది. కొత్త జిల్లాల్లో పాలన కోసం శాశ్వత భవన నిర్మాణాలను గుర్తించేందుకు ఈ నెల 4న సీఎస్‌ అధ్యక్షతన జరిగిన సబ్‌ కమిటీ సమావేశంలో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల లభ్యత విస్తీర్ణత అందుబాటుపై జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అన్నింటిని పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 2నుంచి పాలన ప్రారంభించేందుకు పూర్తి సమాచారం 20న జిల్లా పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది.

నాలుగు సబ్‌ కమిటీలు..

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం నాలుగు రాష్ట్రస్థాయి సబ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లాల సరిహద్దులు, న్యాయపరమైన అంశాల పర్యవేక్షణకు సీసీఎల్‌ఎ ఛైర్మన్‌గా సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. జీఏడీ కార్యదర్శి ఛైర్మన్‌గా భవనాలు, ఉద్యోగుల విభజనకు మరో సబ్‌ కమిటీ ఏర్పాటు చేయగా రహదార్లు, భవనాల శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా భవనాల గుర్తింపు, మౌళిక సదుపాయాల కల్పన, ఐటీ విభాగం కార్యదర్శి నేతృత్వంలో మరో సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఆయా కమిటీలు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన ఆదేశాలు, సూచనలు, సలహాలు జారీ చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement