అమరావతి, ఆంధ్రప్రభ : వసతిగృహంలో విద్యార్ధిని మీద ప్రిన్సిపల్ అత్యాచారానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇక నుంచి రాష్ట్రంలోని మహిళా వసతి గృహాల పర్యవేక్షణపై ప్రత్యేక నిఘా ఉండేలా చర్యలకు ఆదేశించింది. మరోవైపు నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. కాకినాడలోని కొండయ్యపాలెం హెల్పింగ్ హ్యాండ్స్ వసతిగృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్ధిని కరోనా మందుల పేరిట నిద్రమాత్రలు మింగించి ప్రిన్సిపల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఉదంతపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కాకినాడ ఎస్పీతో ఘటనపై ఆరాతీశారు. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ ఏరియాను మహిళా కమిషన్ తరఫున పర్యవేక్షించే కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ ని స్థానిక అధికారులను అప్రమత్తం చేసి.. బాధితురాలి వైద్యసహాయాన్ని పర్యవేక్షించాలని సూచించారు.
ఈమేరకు వాసిరెడ్డి పద్మ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన కొద్దిగంటల్లోనే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రిన్సిపల్ విజయకుమార్‌ను అరెస్టు చేశారు. అతనిపై పోక్సోకు మించిన సెక్షన్లతో కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. వారం రోజుల్లో చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసి నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చూడాలన్నారు. మహిళలు, బాలికల వసతిగృహాల పర్యవేక్షణను ఏ ఒక్కరి చేతిలో ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. ఇద్దరు ముగ్గురు బృందంతో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాల్సిన ఆవశ్యకత ఉందని వాసిరెడ్డి పద్మ ఈసందర్భంగా స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.