ఇక్కడి జన సహనం అంతంతే
ఒక్కసారి చాన్స్ ఇస్తే మళ్లీ కష్టమే
వైఎస్సార్ అస్త్రానికి చిక్కిన ప్రాంతం
ఎన్టీఆర్ రోజుల్లోనే పసుపు సేనకు పగ్గాలు
చిరంజీవి రాకతో మారిన ముఖ చిత్రం
తెరమీదకు సంకుల సమరం
ఇటు సీఎం జగన్ జన జాతర
అటు మార్మోగుతున్న ప్రజాగళం
స్పీడందుకున్న కూటమి రథం పరుగులు
నవ సోయగాల ప్రాంతంలో నయా రాజకీయం
(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయ వాడ ప్రతినిధి)
ఉత్తరాన గలగల గోదారమ్మ.. దక్షిణాన పంచనదీ క్షేత్ర సహిత పెన్నమ్మ .. తూర్పున తుపాను జలది బంగాళాఖాతం.. నడుమ బిరబిరా కృష్ణమ్మ సోయగాలు ఈ ప్రాంతం సొంతం. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం, సహజ సంపదల సమాహారంతో అటు ఆహార పంటలు, ఇటు వాజిజ్య పంటలతో విదేశీ మారక ద్రవ్యార్జితంలో సుసంపన్న కోస్తా ఆంధ్ర అలరారుతోంది. సంపాదనలోనే కాదు, ఆధిపత్య పోరాటంలోనూ రాజకీయ క్రీడలోనూ కోస్తా జనం అంతుచిక్కరు. తేలికగా దొరకరు. తిరుగు మరుగులేని ఈ రాజకీయ వేదికపై తాజా ఎన్నికల సమరంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అంచనాలకు అందని వ్యూహాలు మొదలవుతున్నాయి. ఇవన్నీ రాజకీయ పరిశీలకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారి చాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి … రెండో సారి కన్నెత్తి చూడరు కోస్తా జనం అనేది నానుడి. కానీ, గత రాజకీయ సన్నివేశానికి.. తాజ ముఖ చిత్రానికి చాలా తేడా ఉందన్నది పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఏదైమైనా ఈ సారి కోస్తాలో టగ్ ఆఫ్ వార్ అనివార్యంగా ఉండబోతున్నది. ఫలితాలు ఏక పక్షం కాదని రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆధిపత్యాన్ని సహించరు కానీ…
ఆర్థిక, రాజకీయ, సామాజక రంగాల్లో ఆరితేరిన కోస్తా తీరంలో.. 2024 ఎన్నికల సమరం కాస్త, సంకుల పోరులా మారినట్టే. సుధీర్ఘ కాల ఆధిపత్యాన్నీ, ఏక చత్రాధిపత్యాన్ని కోస్తా జనం సహించరు. ఇష్ట పడితే.. మరో మారు అవకాశం ఇస్తారు. కానీ, అధికార పెత్తనాన్ని అసలు తట్టుకోరు. 2004, 2009లో వైఎస్సార్ నేతృత్వాన్ని కోస్తాజనం అంగీకరించారు. రెండు సార్లూ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. 2004 ఎన్నికల్లో కోస్తాలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 97 సీట్లల్లో కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో విజయం సాధిస్తే టీడీపీ 12 సీట్లు, 7 సీట్లల్లో ఇతరులు గెలిచారు. 2009లో ఈ సీన్ కాస్త మారింది. కాంగ్రెస్ బలం తగ్గింది. కానీ కాంగ్రెస్ ఆధిపత్యం తగ్గలేదు. దీనికి కారణం ఈ ఎన్నికల్లో వైఎస్సార్ వినియోగించిన అస్త్రం రాష్ట్రం విడిపోతే.. ఆంధ్రులు హైదరాబాద్ వెళ్లటానికి ఫాస్ పోర్టు తప్పదని హెచ్చరించటమే. ఫలితంగా కోస్తాలో కాంగ్రెస్ పార్టీకి 51 స్థానాలు, టీడీపీకి 29 స్థానాలు, పీఆర్పీకి 9 స్థానాలు లభించాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఏమాత్రం రాష్ట్ర విభజన ఫలితాన్ని హెచ్చిరించపోతే కాంగ్రెస్ పార్టీకి అధికారం లభించేంది కాదు. అప్పటికే సంకుల సమరానికి మెగాస్టార్ చిరంజీవి మోగించిన శంఖారావం పని చేసింది. కానీ… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది.
సైకిల్ సవారీకి చాన్స్ ఇలా
2014 ఎన్నికల్లో కోస్తా ఆంధ్రులు రాష్ట్ర విభజనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని సమాధి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తమ సహజ లక్షణాన్ని ప్రదర్శించారు. ఏక పార్టీ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. ప్రత్యామ్నాయంగా టీడీపీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో 89 స్థానాల్లో ఫలితాలు సీన్ రివర్స్ కనిపించింది. 2009లో కాంగ్రెస్ పార్టీని 58 స్థానాల్లో గెలిపించిన కోస్తా ప్రజలు 2015లో టీడీపీకి 56స్థానాలు ఇచ్చారు. అప్పుడే మొగ్గ తొడిగిన వైసీపీకి 28 స్థానాలు, బీజేపీకి రెండు స్థానాలు, స్వతంత్రులకు ఒక స్థానం అప్పగించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం, ప్రత్యేక హోదా , ఉత్తరాంధ్ర, రాయలసీయ ప్యాకేజీలు..రాష్ట్ర విభజన నేపథ్యంలో.. తెలంగాణతో సమానంగా అభివృద్ధిని కాంక్షించారు. ఆర్థికంగా రాష్ర్ట పునర్విభజనే ధ్యేయంగా కోస్తా ప్రజలు పని చేశారు. కడకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం దగా చేసిందనే భావన తప్పలేదు. 2019 ఎన్నికల కోసం కోస్తా ప్రజలు ఎదురు చూశారు. టీడీపీ వ్యూహాలు దెబ్బతిన్నాయి.
ఫ్యాన్ గిరా గిరా.. సుడిగాలి
2019లో కోస్తా జనం ఎప్పటి మాదిరిగానే రాజకీయ ఆధిపత్యానికి తెరదించారు. టీడీపీకి చుక్కలు చూపించారు. సంకుల పోరాటంలో బరిలోకి దిగిన జనసేనపై అభిమానం ఉన్నప్పటికీ విజయం దక్కలేదు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ జనసేనానికి ఓటమి తప్పలేదు. 89 స్థానాల్లో వైసీపీకి 74 సీట్లు, టీడీపీకి 14 సీట్లు, జనసేనకు ఒక సీటు దక్కాయి. ఇక వైసీపీ పాలన విషయంలో.. కేవలం సంక్షేమ పథకాలకే పెద్ద పీట పడింది. వ్యక్తి గత ప్రయోజనాలే కనిపించాయి. నవరత్నాలతో జనాన్ని ఆకట్టుకున్నట్టు వైసీపీ భావిస్తోంది. పోలవరం, ప్రత్యేక హోదా , విశాఖపట్నం ఉక్కు సమస్యలు పక్కదారి పట్టటం.. అభివృద్ధిలో అంతంతే కనిపించటం ప్రస్తుతం కోస్తాలో అధికార పార్టీ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య.
టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఇంతకీ కోస్తా జనం సంక్షేమానికి కట్టుబడుతారా? సహజ సిద్ధంగా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తారా? అర్థం కాని పరిస్థితి. ఇటు సంక్షేమం ఆయుధంతో వైసీపీ ఫ్యాన్ సుడిగాలిని సృష్టిస్తుంటే.. ఇటు ఒక చేతిలో తామరపువ్వు.. మరో చేతిలో గాజు గ్లాసులో వేడి వేడి తేనీటిని చిప్ చేస్తూ.. సైకిల్ పై టీడీపీ రివ్వు రివ్వునా పరుగులు తీస్తోంది..ఇప్పటికే కోస్తాలో అనేక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మారారు. ఇక టీడీపీ కండువాతో వైసీపీ సిట్టింగ్లో పసుపు సైనికుల్లా శంఖం పూరిస్తున్నారు. మరో వైపు జనసేన సంకుల సమరనాదమూ మార్మోగుతోంది. నెల్లూరులో టీడీపీని ఊడ్చివేసిన వైసీపీ ప్రస్తుతం హారాహోరీ స్థాయికి చేరింది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ టీడీపీ, జనసేన పట్టు బిగించాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్పిడి, ఎంపీ అభ్యర్థుల దిగుమతి అధికార పక్షం, ప్రతిపక్ష కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ ను సృష్టించినట్టేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.