(హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) – దేశంలో హిందూ యాత్రా స్థలాలన్నింటిని పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు పోటీ పడుతు న్నాయి. ఈ క్షేత్రాలకు జాతీయ, అంతర్జాతీయ యాత్రికుల్ని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఆధ్యాత్మికత కంటే ఉల్లాసం, ఉత్సాహం ఉట్టిపడే రీతిలో పలురకాల నిర్మాణాలు చేపడుతున్నాయి. వీట్నుంచి వీలైనంత రాబడి సాధించేందుకు ఉవ్వి ళ్ళూరుతున్నాయి. దేశంలో ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని లేకుండా ప్రతిచోటా ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలవద్ద ఐదు నక్షత్రాల హోటళ్ళ స్థాయిలో సకల సదుపాయాల్తో కూడిన కాటేజ్‌లు నిర్మిస్తున్నాయి. ఇక ఆలయాల్లో దర్శనాలు, ప్రసాదాల విక్రయాల ద్వారా కూడా పెద్దెత్తున రాబడిని సాధిస్తున్నాయి. ఆఖరకు ప్రసాదాల కొనుగోళ్ళలోనూ పలు నిబంధనలు విధిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఆలయంలో ప్రసాదం లడ్డూను కనీసం ఆరు చొప్పున కొనుగోలు చేయాలంటూ ఆలయ నిర్వాహకులు నిర్దేశించడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. తిరుమలలో పలువురు పారిశ్రామిక, వ్యాపారవేత్తల సహకారంతో నిర్మించిన కాటేజ్‌లను సిఫార్స్‌లకనుగుణంగా ఫైవ్‌స్టార్ హోటళ్ళ రేట్లపైనే కేటా యిస్తున్నారు. సాధారణ దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు ప్రతిచోటా టికెట్లు వసూలుచేస్తున్నారు. ప్రసాదాల రూపం లోనూ ఆర్థిక వనరులు పోగేస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక కేంద్రాల్లో భక్తిభావం పలచనౌతోంది. ఇక్కడకు భగవంతుడి పట్ల ఆరాధనతో కాకుండా విహారయాత్రలో భాగంగా జనం వచ్చే పరిస్థితుల్ని ప్రభుత్వాలే సృష్టిస్తున్నాయి.
కోవిడ్ అనంతరం భారత్‌లో ఆధ్యాత్మిక పర్యాటకం గణనీయంగా పెరిగింది. 2022లో 14.33కోట్ల మంది భారతీయులు వివిధ దేవాలయాల్ని సందర్శించారు. కాగా 66.40లక్షల మంది విదేశీయులు కూడా భారత్‌లోని పలు పుణ్యక్షేత్రాల్ని దర్శించారు. దేశంలోని అతిపురాతన ఆధ్యాత్మిక నగరాల్లో ఒకటైన వారణాశి నుంచి తిరుపతి, పూరి, అమృ త్‌సర్, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, కాట్రా, రుషికేష్, మైసూర్, విజయవాడ, మధురై, వేలూరువంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు పెద్దెత్తున యాత్రీకులొచ్చారు. ఈ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రభుత్వాలు అత్యంత విలువైనవిగా గుర్తించాయి. ఆధ్యాత్మిక కేంద్రాల్ని అభివృద్ధిపరుస్తూనే రాబడి మార్గాల్ని సృష్టించుకుంటున్నాయి. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో సాధారణ ఆశ్రమాలు, కుటీరాలు మాత్రమే ఉండేవి. భగవంతుడ్ని నేరుగా భక్తుల్ని దర్శించుకునే వెసులుబాటు కలిగేది. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో అత్యద్భుతమైన విల్లాల్నుంచి ఆధునిక సదుపాయాలు కలిగిన కాటేజ్‌ల నిర్మాణం పెద్దెత్తున సాగుతోంది. వీటిని సాధారణ హోటళ్ళు, లాడ్జీలకంటే ఎక్కువ ధరలు వసూలు చేసి యాత్రీకులకు అందుబాటులో పెడుతున్నారు.
గతేడాది దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటక విలువ 1.28 లక్షల కోట్లుగా అంచనాలేశారు. ఇందులో సగానికి పైగా ప్రభు త్వాలకే చేరుతోంది. వాస్తవానికి భారత్ లౌకిక రాజ్యాంగాన్ని అనుసరిస్తోంది. ఇక్కడి ప్రభుత్వాలు ఏ మత ప్రార్ధనాలయాల అభివృద్ధికి నిధుల్ని వెచ్చించే అవకాశంలేదు. కానీ ఇప్పుడీ ఆలయాల్ని ప్రభుత్వాలు వ్యాపార దృష్టితో చూస్తున్నాయి. గతంలో ఆలయాల అభివృద్దికి కొందరు దాతలు విరాళాలిచ్చి సహకరించేవారు. వీటినుంచి వారు ఎటువంటి లబ్ధి కోరుకు నేవారుకాదు. కాగా ఇప్పుడు ప్రధాన ఆలయాల్లో కాటేజీల నుంచి విల్లాల నిర్మాణం వరకు పేరెన్నికగన్న పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు ప్రభుత్వాలే అప్పగిస్తున్నాయి. అలాగే ఆలయాల్లో వివిధ నిర్మాణ బాధ్యతల్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. వీటిపై పరోక్షంగా పెత్తనం చేస్తున్నాయి. వీటినుంచి పెద్దెత్తున రాబడి పొందుతున్నాయి. మరో వైపు ఆలయాల్లో దర్శన టికెట్ల విక్రయం నుంచి ప్రసాదాల వరకు ప్రతి దానిపై ప్రభుత్వం జిఎస్‌టి వసూలు చేస్తోంది. దీంతో ఇవి మరింత భారంగా మారాయి. తాజాగా ఆలయాల్లో భక్తులు హుండీల్లో వేసే మొక్కుబడులపై కూడా ప్రభుత్వం జిఎస్‌టి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భక్తులు దేవుడికి సమర్పించే ప్రతి కానుకపైన ప్రభుత్వాలకు పన్ను చెల్లించాల్సిందే. రాన్రాను దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం అత్యంత వ్యయ భరితంగా మారుతోంది. ప్రభుత్వాల చర్యలు భగవంతునికి, భక్తునికి మధ్య దూరం పెంచుతున్నాయని నిపుణులు వాపోతున్నారు.