దేశ భాషలందు తెలుగు లెస్స
తెలుగు పరిణామ వికాసానికి ఇదే తొలిఅడుగు
కడప జిల్లాలో వేడుకలు
ముఖ్యఅతిథిగా రానున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రేపు తెలుగు భాషా దినోత్సవం
ఆంధ్రప్రభ స్మార్ట్, కడప : తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కీలక ఆధారం కలమళ్ల శాసనం. ఈ శాసనం కడప జిల్లా కలమళ్ల చెన్నకేశవ ఆలయ ఆవరణలో లభించింది. క్రీస్తు శకం 575 నాటి తొలి తెలుగు శాసనం (కలమళ్ళ శాసనం) గా గుర్తింపబడింది. తెలుగు భాషకు రాజభాష హోదాను, శాసనభాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, చారిత్రకంగా సాహిత్యపరంగా ప్రాచీన హోదాను అందించిన కీలక ఆధారం ఈ శాసనం. ఆనాటి చరిత్రకు సాక్ష్యాలు అందించిన కలమల్ల వేదికగా తొలిసారి రేపు (గురువారం) తెలుగు భాషా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు కడప జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
తొలి తెలుగు శాసనం…
కలమళ్ల చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించిన శాననం.. కలమళ్ళ శాసనం. ఇదే తొలి తెలుగు శాసనంగా భాషానిపుణులు చెబుతున్నారు. ఇందులో వారు అనే బహువచనం కనిపిస్తుంది. ఎరికల్ ముతురాజు అనే బిరుదుగల ధనంజయుడనే రాజు అంటూ ఈ శాసనం ప్రారంభమైంది. మధ్యలో కొంత భాగం అసంపూర్ణంగా ఉంది. పంచమహాపాతకుడు అవుతారని చెబుతూ ఈ శాసనం ముగిసింది. ఇందులో శకటరేఫను వాడారు. చోళరాజులు వేసినట్లుగా చెబుతున్న మొత్తం ఆరు శాసనాలను కలమళ్ల ఆలయంలో గుర్తించారు. వీటిలో రెండు రాతి బండలపైన రెండు వైపులా అక్షరాలు ఉంటే, మరో రెండు బండలపై ఒకవైపు మాత్రమే తెలుగు అక్షరాలు చెక్కి ఉన్నాయి.
రేనాటి చోళులు వేయించిన శాసనం…
కడప జిల్లాలో చాలా భాగం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని భాగాలను కలుపుకుని రేనాడుగా వ్యవహరించారు. తెలుగును అధికారభాషగా స్వీకరించిన రేనాటి చోళులు తెలుగులోనే శాసనాలు వేశారని చరిత్రకారులు చెబుతున్నారు. తెలుగు భాష ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు వాడుకలోకి వచ్చింది ? పక్కా చారిత్రక ఆధారాలు లేవు. అయినా చోళరాజుల్లో ఒకరైన ఎరికల్ ముత్తురాజు కాలంలో ఇప్పటి కడప జిల్లాలోని కలమళ్లలో తొలి తెలుగు రాతి శాసనం వేశారు. 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు దీనిని గుర్తించారు. 1947- 48లో ఆచార్య కె. నీలకంత శాస్త్రి, ఎం. వెంకటరామయ్య ఈ శాసనాన్ని ప్రచురించారు. ప్రాచీన లిపి ఆధారంగా కలమళ్ల శాసనం ప్రప్రథమ తెలుగు శాసనంగా భారతీయ పురాతత్వ శాఖ అంగీకరించింది. తొలి తెలుగు శాసనం గురించి పాఠ్యంశాలు చేర్చారు.
పరిణామక్రమం ఇలా…
ఆంధ్రప్రదేశ్‌లో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 4వ శతాబ్దం వరకు శాసనాలను ప్రాకృతంలో, 5వ శతాబ్దంలో సంస్కృతంలో రాశారు. కానీ, తెలుగులో మొదట శాసనం వేసిన ఘనత రేనాటి చోళులకే దక్కుతుంది. వీరి శాసనాల ప్రకారం మొదటి వాడైన నందివర్మ తర్వాత ఆయన ముగ్గురు కుమారుల్లో మొదటివాడు ధనుంజయుడు అధికారంలోకి వచ్చాడు. ఆయన 575 నుంచి 600 వరకు పాలించాడు. ఆయనకు ఎరికల్ ముత్తురాజు అనే బిరుదు ఉంది. ఆయన వేయించిన తెలుగు శాసనాల్లో కలమళ్ల శాసనం ఒకటి. చాలా వరకూ శిథిలమైన ఈ శాసనంలో బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు అక్షర లిపికి పరిణామక్రమం ఎలా మారిందో మనం చూడవచ్చు. కొన్నిపూర్తిగా తెలుగు పదాలున్నాయి. అందుకే, తొలి తెలుగు శాసనంగా ఈ కలమళ్ల శాసనాన్ని మనం పరిగణనలోకి తీసుకోవచ్చు అంటూ చరిత్రకారులు వివరిస్తున్నారు.
రేపు తెలుగు భాషా దినోత్సవం…
చరిత్రకు ఆనవాళ్ళు అందించిన కలమళ్లలో ఈ నెల 29న (రేపు) గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల ప్రాంగణంలో లభ్యమైన తొలి తెలుగు శాసనాలను.. ప్రాచీన తెలుగు భాషా వారసత్వ సంపదగా, తెలుగు జాతి ఔన్నత్యాన్ని నలుదిశలా వ్యాప్తిపజేసే ఉద్దేశ్యంతో అదే ప్రాంతంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య రాక
తెలుగు బాషా దినోత్సవ ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు రేపు జిల్లాకు రానున్నారు. గురువారం ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరిన ఆయన 12.15 గంటలకు కలమళ్లకు చేరుకుంటారు. తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుని రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు 30వ తేదీ హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.