34 స్థానాల్లో ఉమ్మడి వర్గాల బలం
12 స్థానాల్లో 5 వేలలోపు మెజారిటీ ఉండే చాన్స్
మరో 22 చోట్ల 10వేల లోపు నెగ్గే అవకాశాలు
ఈ కీలక స్థానాల పైనే ఫోకస్ పెంచిన పార్టీలు
ఓట్లు బదిలీపైనే లీడర్లలో కాస్త అనుమానం
అసమ్మతితోనే టీడీపీ, జనసేనకు ఇరకాటం
(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – విజయమో? వీర స్వర్గమో!.. అనే రీతిలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడే ఇలా అందరినీలో నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపుతుంటే.. టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాట ఫలితంపై రాజకీయ విశ్లేషకులు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఏయే స్థానాల్లో ఈ రెండు పార్టీల ప్రభావం ఎంత ఉంటుందో అంచనాలను రెడీ చేస్తున్నారు. అసలు కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి జాబితా ప్రకటించారు. జనసేనకు 24 స్థానాలు కేటాయించగా.. అందులో ఐదు స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీడీపీ 94 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో వెల్లడించింది. లోక్సభ స్థానాలకు వచ్చే సరికి జనసేనకు 3 స్థానాలు కేటాయించారు. వాటికి అభ్యర్థులను ఖరారు చేయాలి. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత టీడీపీ ఎన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుందో స్పష్టత రానుంది.. అందుకే ఎంపీ అభ్యర్థుల జోలికి వెళ్లలేదు. ఇక తాజాగా టీడీపీ ప్రకటించిన 34 స్థానాల్లో 10వేల లోపు ఓట్ల తేడాతోనే గత ఎన్నికలలో ఓడిపోయింది.. ఇప్పుడు జనసేనతో కలవడం వల్ల 34 స్థానాల్లో గెలుపు సునాయాసమని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఆ 34 స్థానాలపైనే.. ఉమ్మడిసేన గంపెడాశలు
ఉమ్మడిగా టీడీపీ-జనసేన ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ ప్రభావం వైస్సార్ సీపీపై ఎంత? అనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో ఎవరికివారే రీతిలో విడివిడిగా పోటీచేశారు. కానీ, తాజా ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నాయి. దీంతో ఓట్లు చీలకపోతే.. చాలా వరకు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి ఇబ్బంది తప్పదని ఉమ్మడి సేన ఆశపడుతోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన స్థానాల్లో వైసీపీ ఈ సారి మరింత బలం పుంజుకున్నా.. టీడీపీ జనసేన మాత్రం సొంత లెక్కలతో ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నాయి.
వైసీపీకి 5 వేలలోపు మెజారిటీ స్థానాలు
2019 ఎన్నికల్లో 5వేల లోపు మెజారిటీతో వైఎస్సార్సీపీ గెలిచిన స్థానాలు 12 ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ 25 ఓట్ల మెజారిటీ రాగా , తిరుపతి 708ఓట్ల మెజారిటీ, పొన్నూరు- 1,112 ఓట్ల మెజారిటీ, నెల్లూరు సిటీ- 1,988 ఓట్ల మెజారిటీ , తణుకు- 2,195 ఓట్ల మెజారిటీ , నగరి – 2,708 ఓట్ల మెజారిటీ , కొత్తపేట – 4,038 ఓట్ల మెజారటీ , ఏలూరు – 4,072 ఓట్ల మెజారిటీ , యలమంచిలి- 4,146 ఓట్ల మెజారిటీ , తాడికొండ- 4,433 ఓట్ల మెజారిటీ , ప్రత్తిపాడు – 4,611 ఓట్ల మెజారిటీ , జగ్గయ్యపేట – 4,778 ఓట్ల తేడాతో తెలుగుదేశం ఓడిపోయింది. వీటిలో టీడీపీ-జనసేన మిత్రపక్షం ప్రభావం ఎక్కువగానే ఉండనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కానీ ఈ 12 స్థానాల్లోనూ విజయం తమదేనని వైసీపీ ధీమాగా ఉంది.
10వేల లోపు మెజారిటీ స్థానాలు
2019 ఎన్నికల్లో 5 నుంచి -10 వేల లోపు మెజారిటీతో 22 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. రామచంద్రపురం -5,168 ఓట్ల మెజారిటీ , మంగళగిరి – 5,337, కర్నూలు – 5,353, ముమ్మిడివరం -5,547, శ్రీకాకుళం – 5,777, మచిలీపట్టణం – 5,851, విజయనగరం -6,417, నరసాపురం – 6,436, ప్రత్తిపాడు (ఎస్సీ)- 7,398, తాడిపత్రి – 7,511 , విజయవాడ వెస్ట్-7,671, పెడన -7,839, పీలేరు -7,874, అనకాపల్లి – 8,169, చిలకలూరిపేట – 8,301, బొబ్బిలి – 8,352, భీమవరం – 8,357, కాకినాడ రూరల్ – 8,789, సంతనూతలపాడు – 9,078, కైకలూరు – 9,357, భీమిలి – 9,712, వేమూరు – 9,999 ఓట్ల తేడాతో టీడీపీకి ఓటమి తప్పలేదు. . తాజాగా ఈ నియోజకవర్గాల్లో జనసేన-టీడీపీ ఓట్లు చీలక పోతే.. ఈ 22 స్థానాల్లో వైసీపీకి గడ్డు కాలమే అని ఉమ్మడి సేన ఆశపడుతుంది. ఇవ్వన్నీ పాత లెక్కలు, అసలు లెక్కలు వేరేగా ఉంటాయని, ఈ స్థానాల్లో తాము గెలవటం ఇప్పటికే ఖాయమైందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.
ఆ డజనే… వైసీపీకి యమడేంజర్
అధికార పార్టీ ఎంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించినా.. 12 స్థానాల్లో ఇరకాటం తప్పదని రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ, అధికార పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా.. టీడీపీ, జనసేన బలం చెక్కు చెదరటం కష్టం. అదే జరిగితే ఏపీలో వైసీపీ 175 ఖాయం అని పొలిటికల్ ఎనలిస్టుల వాదన. కానీ, భీమవరం, నర్పాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, తణుకు, కొత్తపేట, ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా), విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, పెడన, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనకు అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోవటానకి ప్రధాన కారణం పోల్ మేనేజ్ మెంట్ లేకపోవటమే అని రాజకీయ పరిశీలకుల అంచనా.. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం నియోజకవర్గంలో జనసేనకు 62,285 ఓట్లు వస్తే… టీడీపీకి 54,037 ఓట్లు లభించాయి. అధికార పార్టీ అభ్యర్థికి సుమారు 70 వేల ఓట్లు రావటంతో సుమారు 8 వేల కోట్లతో జనసేనాని దెబ్బతిన్నారు.
టీడీపీ, జనసేన పోటీతో ఈజీ..
ఇప్పడు ఇదే సీటులో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. వీరిద్ధరి ఆధిక్యాన్ని అధిగమించాలంటే అధికారపార్టీకి కనీసం లక్ష పదిహేన వేల ఫిక్సెడ్ ఓటు బ్యాంకు ఉండాలంటే అతిశయోక్తి కాదు. ఇక నర్సాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నయనార్ 49,120 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 27,059 ఓట్లు లభించగా విజేత వైసీపీ అభ్యర్థికి 55,556 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా ఉమ్మడి బలమే ఎక్కువ. మిగిలిన పది నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఇలా ఉంది. ముమ్మిడివరంలో జనసేనకు 33,334 ఓట్లు, కాకినాడ అర్బన్ లో 30,188 ఓట్లు, కాకినాడ రూరల్ లో 40,001 ఓట్లు, తణుకులో 31,921 ఓట్లు, కొత్తపేట 35,833 ఓట్లు, ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)లో 26,721 ఓట్లు , విజయవాడ వెస్ట్ లో 22, 367 ఓట్లు, విజయవాడ సెంట్రల్ లో 29,333 ఓట్లు ( ఈసీటును సీపీఎంకు జనసేన ఇచ్చింది) , పెడనలో 25,733 ఓట్లు, మచిలీపట్నంలో 18,807 ఓట్లు జనసేన చీల్చింది. ఈ స్థితిలో ఈ సారి టీడీపీ, జనసేన ఈ నియోజకవర్గాల్లో జత కలవటంతో…ఉమ్మడి అభ్యర్థికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రాజకీయ పరిశీలకుల అంచనా. కానీ, ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ పని చేయకపోయినా… ఓట్ల బదిలీ జరగకపోయినా.. వైసీపీ ఎగిరి గంతులు వేయటం ఖాయం.