Thursday, November 21, 2024

Special Story ట్విక్ టూ.. ట్విక్ టూ .. రాగాల పిట్ట కోసం అన్వేషణ!


ప్రపంచాన్ని కదిలించిన పిట్ట కూత
స్వరం వినిపించినా కనిపించని రూపం
38 ఏండ్లుగా కలివికోడి కోసం అన్వేషణ
​పక్షి ప్రేమికులతో రోజూ దోబుచులాట
ప్రపంచంలోనే ఏకైక జాతిగా గుర్తింపు
లంకమేశ్వర అభయారణ్యం దీని సొంతం
₹100 కోట్లకు పైగానే ఖర్చు చేసిన ప్రభుత్వాలు
తొలిసారిగా కెమెరా ట్రాప్ ఏర్పాటు
వాయిస్ రికార్డ్​ చేసిన ఆర్నితాలజిస్టులు
కలివికోడి పునర్జీవన ప్రాజెక్టు లక్ష్యం 2027
నిరంతరాయంగా కొనసాగుతున్న యత్నాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌డ‌ప బ్యూరో : కలివి కోడి.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. రంగు రంగుల ఈకలు.. చిన్నపాటి ఆకారం.. వినసొంపైన కూతతో ఆకట్టుకునే కలివికోడి (జర్డాన్స్ కోర్సర్) జాడ కనిపించడం లేదు. అత్యంత అరుదైన ఈ పక్షి అంతరించిపోతున్న జాతుల్లో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా లంకమల అడవుల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఇది కనిపించదు. వందేళ్ల కిందటే అంతరించిపోయిందని ప్రపంచ పక్షి శాస్త్రవేత్తలు భావించినా.. లంకమల అడవుల్లో ఇంకా సంచరిస్తూనే ఉందని అడపాదడపా ఆశలు సజీవంగానే ఉన్నాయి. కడప జిల్లా సిద్ధవటం రేంజ్ రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో ఆ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. కలివి కోడి ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలు ఇప్పటివరకు ₹100 కోట్ల వరకు ఖర్చు చేశాయి. కానీ జాడ లేదు. ఆచూకీ ఊసు లేదు.

- Advertisement -

తొలిసారిగా తెల్లదొర కంట పడి..

1848లో మొదటిసారి బ్రిటిష్ సైనిక వైద్యాధికారి థామస్ జి జెర్ధాన్ కలివికోడిని గుర్తించాడు. తర్వాత 50ఏళ్లుగా అడవిలో దోబూచులాడింది. 1900లో హోవర్డ్ క్యాంబెల్ అనే బ్రిటీష్ వైద్యాధికారి కంటపడింది. కానీ.. 85ఏళ్ల తర్వాత మళ్లీ అదృశ్యమైంది. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, అమెరికా స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు వచ్చి ఈ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేకపోయింది. దీంతో పక్షి శాస్త్రవేత్తలు (ఆర్నితాలజిస్టులు) ఈ పక్షిని అంతరించిన జాబితాలోనే వేశారు. జెర్డాన్ చేసిన ఈ విలువైన పనికి గుర్తింపుగా ఆయన పేరు మీదనే కలివికోడికి జెర్డాన్స్ కోర్సర్ అనే పేరు పెడుతున్నట్లు 1988లో ప్రకటించారు.

తపాల బిళ్లతో గౌరవం..

కలివి కోడి చిత్రంతో భారత కేంద్ర ప్రభుత్వం ఒక తపాలాబిళ్లను విడుదల చేసింది. 1932లో హైదరాబాదు ఆర్నిథాలజీ సర్వే సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ ఈ పక్షిని కనుక్కోవడం కోసం పరిశోధన చేశారు. ఈ పక్షి నమూనా బొమ్మలను ఫారెస్టు అధికారులకే కాకుండా, అడవుల్లో వేటకు, కలప కోసం వెళ్లే వాళ్లకు కూడా అందేలా చేశాడు. బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ ఆధ్వర్యంలో భరత్ భూషణ్ అనే శాస్త్రవేత్త కూడా కలివి కోడి ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. 1975, 1976లో బాంబే నేచుర్‌ హిస్టరీ సొసైటీ, స్మిత్‌ సానియర్‌ ఇనిస్టిట్యూట్‌, వరల్డ్‌ వైడ్‌ లైఫ్‌ అం డ్‌ ఇండియా సంస్థలు సంయుక్తంగా ప్రయత్నాలు చేపట్టారు. 1981లో గవర్నమెంటు ఆఫ్‌ ఇండియా యునైటెడ్‌ స్టేట్‌ షిప్‌ అండ్‌ వైడ్‌ లైఫ్‌ సమిష్టితో కలసి తిరిగి ప్రాజెక్టును చేపట్టింది. అప్పటికే గ్రేస్‌ ఇండియన్‌ బస్టర్‌ (బట్టమేక)పై పరిశోదనలు చేస్తున్న భరత్‌ భూషణ్‌కు కలివికోడి ఆనవాళ్లు గుర్తించే పనిని అప్పగించారు. ఎన్‌హెచ్‌ఎస్‌ సంస్థ పరిశోధన చేసినా కనిపించలేదు.

1986లో ఇలా కనపడి, అలా మాయం..

1986 జనవరి 5వ తేదీన కడపజిల్లా రెడ్డిపల్లి ‘ఐతన్న’ అనే సాధారణ గొర్రెల కాపరి ఈ పక్షుల జంటను గమనించాడు. రెండు కలివికోళ్లు కనిపించగా ఒకటి పరారైంది. ఒకటి శాస్త్రవేత్తలు వచ్చి చూసే లోపే చనిపోయింది. దీంతో బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ వారు తొలిసారిగా ఈ పక్షిని మ్యూజియంలో ఉంచారు. అప్పటినుంచి ఈ పక్షి కడప జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో కనిపిస్తూనే ఉంది. ఈ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటినుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

తొలిసారిగా కెమెరా ట్రాప్..

2019 జనవరి 29న బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన సీనియర్ పరిశోధకులు ప్రకాశన్ జగన్నాథన్ ఈ పక్షి అరుపును కూడా రికార్డు చేసారు. ‘‘ ట్విక్-టూ ట్విక్-టూ ’’ అంటూ అరుస్తుంది. కోయిలను మించి పోయి అరగంటైనా నిరంతరంగా కూత పెట్టే ఈ పక్షి నవంబరు నుంచి మార్చి మధ్య ఎక్కువగా కూత పెడుతూ ఉంటుంది. తీతువుపిట్ట, పూరేలు, కంజులను పోలి ఉండే ఈ కలివికోడి కాళ్ల వేళ్లను కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. తొలిసారి ఇండియాలో ఈ కెమెరాట్రాప్‌ను కలివికోడి కోసం కడప జిల్లాలో ఉపయోగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలివికోడి ఆచూకీ కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్నాయి. అట్లూరు మండలంలోని అట్లూరు కొండూరు, ఎస్.వెంకటాపురం, గుజ్జలవారిపల్లె, తంబళ్లగొంది, ఎర్రబల్లి, బద్వేలు మండలంలోని రాజుపాలెం, తిప్పనపల్లె తదితర గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి కలివికోడి సంరక్షణ అభయారణ్యంలో కలిపింది.

₹100 కోట్ల పైగా ఖర్చు..

అభయారణ్యం కోసం రైతుల భూములకు పరిహారంగా ₹28 కోట్లు చెల్లించారు. ఇతర అన్ని అవసరాలకు మరో ₹22 కోట్లకు పైగా ఖర్చుచేశారు. కొండూరు వద్ద పరిశోధన కేంద్రం.. సిబ్బంది జీతభత్యాలు.. అత్యాధునిక కెమెరాల నిర్వహణ.. సర్వే, ఖర్చుల నిమిత్తం ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ పరిశోధన సంస్థలు ఇప్పటివరకు ₹100 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సిద్దవటం-బద్వేలు రోడ్డు.. అభయారణ్యం పరిధిలో ఉంది. రాత్రివేళ ఇబ్బంది కలుగుతుందని వాహనాలను నిలిపివేస్తున్నారు. అనేకరకాల చిత్ర విచిత్రమైన జంతువులు అడవిలో అమర్చిన కెమెరాల్లో కనిపిస్తున్నా.. కలివికోడి మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికి స్థానిక అధికారులు వెతుకులాట కొనసాగిస్తునే ఉన్నారు.

అటవీ ప్రాంతంలో 250 కెమెరాలు..

కొండూరు బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో విడతల వారీగా సుమారు 250 కెమెరాలు అమర్చి అన్వేషణ ప్రారంభించారు. ఇరవై రోజులకొకసారి అందులో నిక్షిప్తమైన చిత్రాలను సేకరించి మళ్లీ అమర్చేవారు. ఇలా ఈ ఏడాది జూన్ వరకు కొండూరు, అట్లూరు, రెడ్డిపల్లె, రాజుపాలెం, వీరబల్లి, తదితర అటవీ ప్రాంతాల్లో వేట కొనసాగిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కలికికోడి పునర్జీవ ప్రాజెక్టును మంజూరు చేసింది. దీనికి సుమారు రూ.5.73 కోట్ల నిధులు కేటాయించింది. కలివి కోడి ఆవాస ప్రాంతాల్లో ఆధునాతనమైన వాయిస్‌ రికార్డర్లు, కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం ఈ నిధులు ఖర్చు చేస్తారు. 2027 వరకు ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా మైసూరుకు చెందిన నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ శాస్త్రవేత్త జగన్నాథన్ ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి.

తెలుగుగంగ ప్రాజెక్టు దారి మళ్లింపు..

పిడికెడు దాటని ఈ పిట్ట.. వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టిన తెలుగుగంగ ప్రాజెక్టును దారి మళ్లించింది. దీని సంరక్షణ కోసం తెలుగుగంగ కాలువను దారి మళ్లించుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయి. తన ఆవాసంలో తిప్పిన కాల్వను మళ్లీ పూడ్చి వేసేదాకా వదల లేదు. అందుకు బాధ్యులైన వారిని కోర్టుకీడ్చి దోషులుగా నిలబెట్టారు. తెలుగుగంగ పథకం కింద శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయరు దిగువన తెలుగుగంగ కుడి ప్రధాన కాల్వ 30 కిమీ నుంచి 40 కిమీ వరకు కలివికోడి ఆవాసమైన అభయారణ్యంలో తవ్వకాలు జరిపేందుకు తెలుగుగంగ అధికారులు సిద్ధమయ్యారు. ప్రొక్లైన్లతో 400 మీటర్ల కాలువ తవ్వకం పూర్తియన తర్వాత. అభయారణ్యంలోకి అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించి తవ్వకాలు జరిపినట్లు గుర్తించిన కడప అటవీశాఖాధికారులు 2005 నవంబరు 23న ఈ విషయమై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement