సంగీత ఝరి పవరవళ్లు తొక్కాల్సిందే
పనస మధురం.. సంపెంగ సౌరభం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలుగు వీణ
పుట్టింది బొబ్బిలిలో.. పెరుగుతోంది నూజివీడులో
భవిష్య తరాలకు శిక్షణ కోసం కళాకారుడు షేక్ మాబూ తపన
వీణ వేణువైన సరిగమ విన్నావా.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. వీణేంది.. వేణువేంది. వీణకేమో తీగలుంటాయి. వేణువుకు కన్నాలుంటాయి. వింటానికి ఈ రెండు చాలా బాగుంటాయి. ఏందో వేటూరి కలంలోనూ ఈ కలకలేందో.. అంటే నిజమే.. వీణ అంటే ఓ సప్తస్వర ఝరి. వీనుల విందు చేసే మహత్తరం. పశుపక్ష్యాదుల గొంతులో వెల్లివిరిసి.. మనిషి మదిని దోచిన గమకం. అసలు ఈ తంత్రుల ధ్వని ఎలా పుట్టింది. చదువుల తల్లి సరస్వతి మాత చేతిలో హస్తభూషణంగా ఎలా మారింది? ఇత్యాధి విషయాలన్నీ ఒక్క సారి అవలోకనం చేసుకుంటే.. ఎన్నో ఎన్నెన్నో ఆశ్చర్య సంగతులు అబ్బుర పరుస్తాయి.
విల్లు దెబ్బతో.. సప్త స్వరాధీనం
ఆది మానవ వ్యవస్థలోనే ఈ సంగీత విభావరి ఆవిష్కరణ జరిగింది. అడవిలో పక్షుల కూతలు. మృగాల ఘర్షణల నేపథ్యంలోనే.. ఆహారాన్వేషణలో అడవి దంపతులు జరిపిన వేటలో విల్లు ప్రధాన భూమిక అయ్యింది. విల్లు చేబూని గురిపెట్టి నారి లాటి విల్లంబును వదిలితే.. ఆ వేట విజయవంతమే. ఇక్కడే నారి సర్వం మనిషి గుండెను కదిలించింది. మానవ జాతికి ఓ సంగీతాస్త్రాన్ని అందించింది. అదే వీణ.
అయిదువేల ఏళ్ల కిందటే..
ఔను ఈ వీణ 5000 ఏళ్ల నాటిదని మన చరిత్ర చెబుతోంది. రుగ్వేదం, సామవేదం సాక్షిగా.. మానవ జాతితో వీణ అనుబంధమే అనితరం. ఇది సరే.. ఈ వీణ మూడు రూపాల్లో భారతీయలను ఇప్పటికీ అలరిస్తోంది. ఉత్తర భారతంలో రుద్రవీణ.. దక్షిణ భారతంలో సరస్వతీ వీణ.. నడుమ విచిత్ర వీణగా వెలుగొందుతోంది. ఇక క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచి సరస్వతీ వీణంటే మక్కువ చూపని రాజు లేడు. మహరాజు సముద్ర గుప్తుడు తన బంగారు నాణెంలో వీణను చేబూని సరిగమలు పలికిస్తున్న దృశ్యంతో తన ప్రజల్ని అలరించాడు.
నవీన భారతంలో …
తంజావూరు, సరస్వతీ వీణలు భారత దేశంలో సంగీత ప్రియులను అలరించి, మురిపించి. మైమరపిస్తే.. ప్రతి రాజ్యంలోని నాట్యకళారాధనకు రంజిత స్వరం అందించిన ఘనత వీణదే. తీగ లేనిదే వీణ లేదు. వీణ లేనిదే స్వరం లేదు. మారాజుల కాలం అంతరించినా.. తెల్లదొరల పాలనొచ్చినా.. జమీందార్లు పాలించినా.. తమ గడీల్లో నాట్య తరంగం మోగాల్సిందే. వీణ ప్రతిధ్వనించాల్సిందే. సరీగా ఇలాంటి తరుణంలో తెలుగు నేలపైనా, వీణ తీగల స్వరం పురుడుపోసుకుంది.
తెలుగునాట బొబ్బిలిలో బీజం
300 ఏళ్ల కిందట ఆనాటి బొబ్బిలి సంస్థానాధీశులు మైసూరు వెళ్లారు. మైసూరు సంస్థాన దర్బార్‌లో వీణా కచేరి వినగానే తనువు ఊగిపోయింది. అంతే.. తమ సంస్థానంలోనూ వీణ తప్పనిసరి అనుకున్నారు. మైసూరు వడ్రంగులు ప్రత్యేతను గుర్తించి.. బొబ్బిలి రాజా తన సంస్థానంలోని ఇద్దరు వడ్రంగులను మైసూరులో శిక్షణకు పంపించారు. అలా వీణ తయారీకి బొబ్బిలిలో బీజంపడింది. మూడు కొయ్య ముక్కలను కలిపి మైసూరు, తంజావూరు వడ్రంగులు తమ వీణలను తయారు చేయగా.. బొబ్బిలి వడ్రంగులు మాత్రం ఏకండి కొయ్య ముక్క తోనే వీణను తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. పనస, సంపెంగ చెక్కలతో సుగంధ భరిత వీణను తయారు చేసి.. జియోగ్రాఫికల్ గుర్తింపును సాధించారు.
నూజివీడు తక్కువేం కాదు గురూ..
ప్రపంచవ్యాప్తంగా స్వప్తస్వరాల ఘని వీణకు తెలుగు నేలలో మరో పుట్టినిల్లు నూజివీడు. ఈ వీణకూ ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. 120ఏళ్లుగా వంశపారం పర్యంగా నూజివీడు వీణ జమీందార్ల ఆదరణ పొందుతోంది. ఇక్కడే చిన్న ట్విస్ట్. మూడు తరాలుగా వీణ తయారీనే జీవనాధారంగా బతుకుతున్న కళాకారులకు ప్రశంసలే గానీ.. పిడికెడు మెతుకులే కష్టమవుతున్నాయి. వీణ తయారీలో అందెవేసిన చెయ్యిగా ఉన్న నూజివీడు పట్టణంలోని వీణ కళాకారుడు షేక్ మాబు గురించి తెలుసుకుందాం..
మాబూ చేత.. స్వరాలు పలికేలా..
వీణ తయారీ కళాకారుడు షేక్ ఖాశింసాహెబ్.. ఆయన కుమారుడు షేక్మీరా సాహెబ్, ప్రస్తుత షేక్ మాబు.. కడకు ఇతని ఇద్దరు కుమారులు ఈ వృత్తిలో ఆరితేరారు. వీణలు తయారుచేసి ప్రపంచ వ్యాప్తంగా తమ వీణలను పంపిస్తున్నారు. అతిచిన్న వీణనుంచి సాధారణ వీణ వరకు తయారు చేయడానికి 21 రోజుల సమయం పడుతుంది. ఈ వీణకు ఉపయోగించే పనస చెక్కలను పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి, కొవ్వూరు తదితర ప్రాంతాల నుంచి తీసుకువస్తారు. స్వప్త స్వరాలు పలికించడానికి అవసరమైన తీగలు.. రాడ్స్ తదితర వస్తువులు మద్రాస్, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నుంచి తీసుకువస్తారు. ఈ వీణను తన నైపుణ్యంతో అపార అనుభవంతో స్వప్త స్వరాలు పలికించటంలో షేక్ మాబూ సిద్దహస్తుడు.
ఇప్పటికీ ఎన్నో అవార్డులు
ఎన్నోఅవార్దులు అందుకున్నారు. ఈయన తయారు చేసే వీణలలో సరస్వతి వీణ. మయూరీ వీణ. మీరా వీణ, డ్రాగన్ వీణ. విపంచి వీణ. శంఖం వీణ, గోటు వీణ. మధుర వీణ, మశ్చ వీణ ప్రసిద్ది చెందాయి. జీనియస్‌బుక్ ఆఫ్‌రికార్డు, వండర్‌బుక్ ఆఫ్ రికార్డు, భారత్ వరల్డ్ రికార్డు, కల్చరల్ బుక్ ఆప్‌రికార్డ్స్, హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్.. అసిస్టెట్ వరల్డ్ రికార్డు, వీణారత్న, దత్తపీట ఆస్థాన విద్వాన్, బ్రావో ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, స్టేట్ అవార్డులు ఇలా అనేక ప్రశ్నంసలు మాబూకు అందాయి.
ప్రశంసల జల్లులు
2014లో ఏపీ హ్యాండీ క్రాప్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉత్తమ వీణల రూపశిల్పి అవార్డుతో సత్కరించింది. మైసూర్‌లో గణపతి సచ్చినానంద స్వామి ఆశ్రయంలో దత్తపీట ఆస్దాన విద్యాన్ అనే బిరుదును ప్రదానం చేసింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, టి.సుబ్బిరామిరెడ్డి, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యం, అయ్యగారి శ్యాంసుందర్, 2017లో పాండిచ్చేరిలో, 2018లో హైదరాబాద్‌లో అవార్డుతో పాటు , అక్కినేని నాగేశ్వరరావు కళావేదికలో అవార్డు అందుకున్నారు. సుమారు 40 సంస్థలు వివిధ రకాల బిరుదులతో అవార్డు అందించాయి. హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో తాను తయారు చేసిన ఆరు అంగుళాల చిన్నవీణకు అసిస్ట్ వరల్డ్ రికార్డు బుక్‌లో షేక్ మాబూ స్దానం సంపాదించారు.
చిన్న వీణలతో మురిసిన ప్రముఖులు
మీరా అండ్ సన్స్ వీణ మేకర్స్ వెల్ఫేర్ సొసైటీ తరపున వీణల తయారు చేస్తున్న షేక్ మాబు గృహాన్ని చేతి వృత్తిదారుల సంక్షేమ సంఘం ఛైర్‌పర్సన్ బడిగించాల విజయలక్ష్మి ఇటీవల సందర్శించారు. ఇప్పటివరకు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అజాద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంగీత విద్యాంసులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, డాక్టర్ మేదులూరి కృష్టమూర్తి, డాక్టర్ నూకల చిన్న సత్యం, వీణా చిట్టిబాబు, డాక్టర్ అన్నవరపు రామస్వామి, అయ్యగారి సోమేశ్వరరావు, సంగీత విద్యాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి.. మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామిజీ, కంచికామకోటి పీఠాతిపతి జయేంద్ర సర్వస్వతి, పుట్టపర్తి సత్యసాయిబాబ, వీణా శ్రీవాణి, అయ్యంగార్ శ్యాంసుందర్, సీఎం జగన్‌వెూహనరెడ్డి, మాజీ సీఎంలు చంద్రబాబు, రోశయ్య,నూజివీడు వీణల్ని అందుకుని మురిసి పోయారు.
శివుడికి అత్యంత ప్రీతిదాయకం వీణానాదం
వీణాధరి అంటే సరస్వతి. ఆ దేవత వీణానాద దివ్య ధ్వని సప్తస్వర ప్రతిభకు మూలం. ఆమె వీణను కచ్ఛపి అంటారు. పరాశక్తి హస్తాల్లో కూడా వీణ కనపడుతుంది. శివుడికి వీణానాదం అంటే చాలా ఇష్టం. ప్రణవనాదం ప్రాణ, అగ్ని సంయోగం పొంది సరిగమపదని అనే సప్త స్వరాలుగా విభజన పొందినట్టు త్యాగరాజు తన కీర్తనలో వివరించారు. సుషుమ్న నాడిలో వీణ ప్రక్రియలున్నాయని యోగవాసిష్టం చెబుతోంది. అంతేకాకుండా ఎందరో దివ్య మునులు వీణా వాదకులుగా ఉన్నారు. నారదుడి వీణ పేరు మహతి. అగస్త్యుడికి, రావణుడికి వీణా వాదనలో పోటీ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. మంత్రాలయం రాఘవేంద్రస్వామి గొప్ప వీణా విద్వాంసుడు. వీణ భాగాలను కుండ దండి యాళి బుర్ర అనే నాలుగు భాగాలుగా విభజించారు. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులను వీణకు బిగిస్తారు. పక్కన శ్రుతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు. ఈ వాద్యానికి 24 మెట్లు ఉంటాయి. పనస చెట్టు నుంచి సంగ్రహించిన వీణసారె వీణ తయారీలో ప్రధానమైన భాగం. వీణ సరస్వతి దేవి హస్త భూషణం కనుక వైణికులు ఈ జంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పూజిస్తారు
============
శిక్షణ కేంద్రం ఏర్పాటే కోరిక: కళాకారుడు షేక్ మాబూ
నా తాతగారు షేక్ ఖాశింసాహెబ్ దగ్గర మా నాన్న షేక్మీరా సాహెబ్ నేర్చుకున్నారు. నా తండ్రి దగ్గర ఈ వీణల తయారీ నేర్చుకున్నా. చిన్న వీణ తయారీకి నెల రోజులు పడుతుంది. నెలకు ఆరు వీణలు తయారు చేస్తా. నాతో ఆరుగురు పనిచేస్తున్నారు. మూడు తరాలు ఈ వృత్తినే ఎంచుకున్నాం. ప్రపంచ రికార్డులు వస్తున్నాయి. కానీ, శిక్షణ ఇవ్వటానికే స్థలం లేదు. ప్రభుత్వం స్థలం అప్పగిస్తే.. ఓ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వీణ తయారీలో నూజివీడుకు విశ్వవ్యాప్త కీర్తిని అందించాలన్నది నా అభిలాష. ఎందుకంటే ప్రాచీణ వీణ తయారీ కళ అంతరించిపోకూడదు. కేవలం తన కుటుంబంతో నూజివీడు కథ కంచికిపోకూడదు.