Saturday, June 29, 2024

Special Story – హూ ఈజ్ స్పీకర్…! … పురందేశ్వరీ.. మహతాబ్ ?

కాషాయ పసుపు సేన మధ్య మైత్రి బంధం.. అటు ఢిల్లీలోనూ.. ఇటు అమరావతిలోనూ పెనవేసుకున్న తరుణంలో… కేంద్రంలో లోక్ సభ, రాష్ర్టంలో శాసన సభలను తమ కనుసన్నల్లో నడిపించే సభాపతి ఎంపికపై ఎన్డీయే ఓ ఆలోచనకు వచ్చినట్టే. కానీ, బీజేపీ పెద్దదిక్కు ఆర్ ఎస్ ఎస్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో.. సభాపతి ఎవరు? అనే అంశంగా ఇంకా మిస్టరీగానే మారింది. రాజకీయ వర్గాల్లోనూ తర్జన భర్జన తప్పలేదు. ఈసారి లోక్ సభ లో సొంత బలం లేకపోవడంతో భాగస్వామ్య పక్షాల బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. లోక్ సభ లో కీలక స్పీకర్ పదవి విషయంలో కూటమి సభ్యులతో చర్చలు జరిపింది. ఒడిశా లేదా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నాయకులకు ఈసారి స్పీకర్ పదవి దక్కుతుందని సంకేతాలు అందుతున్నాయి. ఈ రెండు రాష్ర్టాల్లో ఓ రాష్ట్రానికి ఆర్ ఆర్ ఎస్ అనుమతి లభిస్తుందో? ఉత్కంఠ భరితంగా మారింది.

( ఆంధ్రప్రభ స్మార్ట్, ఢిల్లీ/ విజయవాడ ప్రతినిధి)
మోదీ కేబినెట్లోని మంత్రులు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే )లోని బీజేపీ మిత్రపక్షాల సమావేశం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంట్లో జరిగింది. లోక్ సభలో కేవలం 240 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్న బీజేపీ స్పీకర్ పదవి దక్కాలంటే దాని మిత్రపక్షాల మద్దతు అవసరం. గత దశాబ్దంలో బీజేపీకి సొంతంగా బలం రావడంతో ఎవరి మద్దతు లేకుండానే స్పీకర్ పదవిని సొంతం చేసుకుంది. ఇప్పుడు కీలక స్పీకర్ పదవి దక్కాలంటే మిత్రపక్షాల మద్దతు అవసరం సభ లో సాధారణ మెజారిటీ ఎంపీల ఓటింగ్ ద్వారానే స్పీకర్ ఎన్నిక అనేది ఉంటుంది.

- Advertisement -

ప్రస్తుతం ఈ పదవికి తనకు కావాలని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. కుదరక పోతే ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరికి ఈ పదవి ఇవ్వాలని కోరినట్లు కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ అధిష్టానం దృష్టిలో ఒడిశా నేత భట్రుహరి మహతాబ్ కూడా స్పీకర్ పదవి రేసులో ఉన్నారు. మహతాబ్ బిజూ జనతా దళ్ మాజీ సభ్యుడు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పురందేశ్వరి నాయకత్వం వహిస్తున్నారు. మరో వైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా లోక్ సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. ఈ స్థితిలో .. బీజేపీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో ? ఉత్కంఠ భరితంగా మారింది. స్బీకర్ పదవిని తామే తీసుకుని, డిప్యూటీ స్పీకర్ పదవిని మిత్ర పక్షాలకు అప్పగించే వ్యూహంలో బీజేపీ ఉంది. ఉప సభాపతి పదవులకు మిత్ర పక్షాలు అంగీకరిస్తాయా? లేదా? అనేది రాజకీయ పరిశీలకుల అనుమానం. ఏతావాతా లోక్ సభ స్పీకర్ రేసులో ఏపీ అధినేత్రి పురందేశ్వరి భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిన మాట వాస్తవం.

ఏపీలోనూ కూటమి తర్జన భర్జన

ఏపీలో కూటమి నేత చంద్రబాబు నాయుడు తన మిత్ర పక్షాన్ని అన్ని విధాల సంత్పృప్తి పర్చే వ్యూహాలనే అమలు చేస్తున్నారు. అసెంబ్లీలో అత్యధిక బలం ఉన్నప్పటికీ… ఈ ప్రభుత్వం ఏర్పాటుకు మిత్రపక్షాల బలగమే కారణమన్నట్టు వ్యవహరిస్తున్నారు. గతంతో తాను చెప్పిందే వేదవాక్కుల వ్యహరించే చంద్రబాబు నైజంలో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. తాను తీసుకునే ప్రతినిర్ణయం.. తన మిత్ర పక్షానికి ఆమోదం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఏపీ శాసన సభ స్పీకర్ విషయంలో… టీడీపీ సభ్యుడినే సభాపతిగా ఎన్నుకునే విధంగా చర్చలు జరిపారు. టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చింతకాయల అయన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈనెల 21న అసెంబ్లీ సమావేశంలో ప్రొటెం స్పీకర్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు.

అసెంబ్లీకి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. గురువారం బుచ్చయ్య చౌదరి తో ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణం చేయిస్తారని సమాచారం. శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఇక డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో క్లారిటీ రాలేదు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే బేటీ అయ్యారు. జనసేన నుంచి ఎన్నకైన ఏకైక మహిళ ఎమ్మెల్యే లోకనాధం మాధవిని డిప్యూటీ స్పీకర్ ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. స్పీకర్ పొడియంలో ఓ మహిళకు స్థానం కల్పించటమే మంచిదని చంద్రబాబు యోచించినట్టు తెలిసింది. టీడీపీ అధినేత ఎన్డీరామారావు హయాంలో ఉత్తరాంధ్రకు చెందిన ప్రతిభ భారతి స్పీకర్ గా పని చేశారు. ఆ ఒరవడిని గుర్తుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక జన సేన నుంచి తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కూడా రేసులో ఉన్నారు. ఈ స్థితిలో మరో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక వ్యవహారంపై ఉత్కంఠతపై తెర వీడిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement