రేవ్ పార్టీ ఎలా జరుపుకుంటారు
ఇందులో సినీ తారలు, లీడర్ల పనేంటి
హైదరాబాద్, బెంగళూరు శివార్లలో ఏం జరుగుతోంది
మత్తులో జోగడానికే కొత్త తరహా పార్టీలా
మద్యంతోపాటు డ్రగ్స్ వినియోగిస్తారా?
అమ్మాయిలను కూడా సప్లయ్ చేస్తారా
ఐటీ సెక్టార్‌లలోనే ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్
భారత్‌లో విచ్చలవిడిగా విదేశీ సంస్కృతి
ఉక్కుపాదం మోపాలంటున్న సామాన్యులు
రేవ్ పార్టీ.. ఈ పేరు ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసుల దాడి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు సినీతారలు, రాజకీయ ప్రముఖులు ఈ పార్టీలో పాల్లొన్నట్టు ప్రచారం జరుగుతుండమే దీనికి కారణం. అయితే.. రేవ్ పార్టీ అని వినడమే తప్ప చాలామందికి ఇందులో ఏం జరుగుతుందో తెలియదు. దీంతో అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి? ఎలా జరుపుకుంటారు? ఇది చట్ట విరుద్దమా.. ఇందులో పాల్గొనడం నేరమా? ఈ కల్చర్ ఎక్కడినుండి వచ్చింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు రేవ్ పార్టీ అంటే ఎంటో చదివి తెలుసుకుందాం.
రేవ్ పార్టీ అంటే ఏమిటి?
ఒక్కప్పటి ఇండియా వేరు… ఇప్పుడున్న ఇండియా వేరు. సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన దేశంలో వెస్ట్రన్ కల్చర్ పెరిగిపోయింది. దేశం అభివృద్ది చెందుతోంది… ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి కాబట్టి కల్చర్‌లో తేడా వచ్చేసింది. ఇలా కాలంతో పాటు యువత బిహేవియర్ కూడా మారుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కల్చర్‌కు అలవాటుపడ్డ యువత మరింత ఎంజాయ్ చేసేందుకు నిర్వహిస్తున్నవే ఈ రేవ్ పార్టీలు.
వెస్ట్రన్ కల్చర్‌కు అలవాటుపడి..
నేటి హైటెక్ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఉన్నత చదువుల కోసమో, ఉపాధి కోసమో భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. అలాగే.. కేవలం ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు, విహారయాత్రలకు వెళ్లేవారు కూడా ఉన్నారు. దీంతో పాశ్చాత్య సంస్కృతి దేశంలోకి ఎంటర్ అయ్యింది. విదేశాల్లో మరీముఖ్యంగా బ్రిటన్, అమెరికా వంటి అడ్వాన్స్‌డ్ కల్చర్ కలిగిన దేశాల్లోనే భారతీయులు ఎక్కువ. కాబట్టి అక్కడి కల్చర్‌ను వంటపట్టించుకుని స్వదేశానికి వస్తున్నవారు.. ఇక్కడివారికి ఆ పార్టీ కల్చర్‌ను కొంతపుంతలు తొక్కిస్తున్నారు. ఇలాంటి వాటిలో రేవ్ పార్టీ ఒకటి.
అంతా సీక్రెట్.. బడా బాబుల పిల్లలకే ఎంట్రీ
రేవ్ పార్టీ ఏర్పాటు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మామూలు హంగామా వుండదు. కానీ రేవ్ పార్టీ అలాకాదు… సినీ తారలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నా అంతా గోప్యంగా వుంటుంది. ఎందుకంటే ఈ పార్టీ జరిగే పద్దతి అలాంటిది కాబట్టి. రేవ్ పార్టీలో బడాబాబుల పిల్లలకే ఎంట్రీ. వారిని ఆకర్షించేందుకు సినీ తారలను రంగంలోకి దింపుతారు నిర్వహకులు. అంతేకాదు.. మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఏర్పాటుచేస్తారు. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే అమ్మాయిలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా విచ్చలవిడితనానికి నిలువెత్తు రూపమే ఈ రేవ్ పార్టీలు. చెవులు పగిలే మ్యూజిక్ కు మద్యం, డ్రగ్స్ మత్తులో చిందులేయడం… అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతూ ఎంజాయ్ చేయడమే ఈ పార్టీ కల్చర్. అందువల్లే యువత చాలా ఈజీగా ఈ రేవ్ పార్టీలకు అలవాటుపడుతున్నారు. నిర్వహకులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు.
రేవ్ పార్టీ ఎక్కడ పుట్టింది
రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950 సమయంలో ఇంగ్లాండ్‌లో మొదలయ్యింది. మెల్లమెల్లగా ఇది ప్రపంచానికి పాకింది. ఇండియాలోకి ఈ కల్చర్ కాస్త ఆలస్యంగా వచ్చినా… ఇప్పుడది ప్రతిచోటికి పాకింది. గోవా వంటి టూరిస్టు ప్రాంతాల్లో తొలినాళ్లలో రేవ్ పార్టీలు జరుగుతుండేవి.. కానీ, ఇప్పుడవి ప్రతి నగరానికి చేరాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ నగరాల్లో ఈ రేవ్ పార్టీలు ఎక్కువగా జరగడం విశేషం.
ఎంట్రీ ఫీజు.. 50 లక్షలు
రేవ్ పార్టీ నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారం. కాబట్టి అందులో పాల్గొనాలన్నా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక.. చట్టవిరుద్దంగా డ్రగ్స్, అమ్మాయిలు ఉంటారు… సినిమా వాళ్లు కూడా పాల్గొంటారు కాబట్టి సీక్రెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్లే బాగా తెలిసినవారు, డబ్బున్నవారికే ఎంట్రీ ఉంటుంది. ఇక.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక్కక్కరికి ఎంట్రీ ఫీజుగా 50 లక్షలుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
మత్తులో ఎంజాయ్ చేయడమే లక్ష్యం
సిటీస్‌కి దూరంగా ఉండే ఫామ్ హౌస్‌లు, రిసార్ట్‌లలో ఈ రేవ్ పార్టీలు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టినా ఎవరికీ తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇక.. మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తుంటారు. పార్టీలో పాల్గొనే యువతీ యువతులు ఏం చేసినా అడిగేవారు ఉండరు. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే శృంగార కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులను కూడా కేటాయిస్తారు. ఇలా మత్తులో ఎంజాయ్ చేయడమే రేవ్ పార్టీ లక్ష్యం..
రెండు, మూడు రోజుల దాకా కొనసాగేలా
ఇలా మొదలైన పార్టీ.. ఓ రోజంతా లేకపోతే రెండుమూడు రోజులు ఎంజాయ్ చేసేలా నిర్వహిస్తుంటారు. ఒక్కసారి రేవ్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే చాలు.. బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ముందుగానే తీసుకుంటారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా పనిచేయవు. ఇలా ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా భయం లేదనే భరోసాను నిర్వహకులు ఇస్తారు. కాబట్టి రేవ్ పార్టీల్లో యువత రెచ్చిపోతుంటారు. రోజురోజుకు యువతలో ఇలాంటి పార్టీలపై ఆసక్తి పెరుగుతోంది… కాబట్టి బెంగళూరులో మాదిరిగా రేవ్ పార్టీలు బయటపడుతున్నాయి.
రేవ్ పార్టీలు చట్టవిరుద్దమా?
సాధారణంగా పార్టీలు జరుపుకోవడం వేరు… రేవ్ పార్టీలు వేరు. మద్యంతో కూడిన పార్టీలు, రిసార్టులు, ఫామ్‌హౌస్‌లలో జరిగే పార్టీలకు పోలీసులు అనుమతి తప్పనిసరి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా పార్టీ జరిగితే ఓకే. కానీ, డ్రగ్స్, అమ్మాయిలు ఎంటర్ అయితేనే ఆ పార్టీ కాస్త చట్టవిరుద్దంగా మారుతుంది. రేవ్ పార్టీల్లో డ్రగ్స్, అమ్మాయిలు కామన్ కాబట్టి చట్టవిరుద్దమే. ఇలాంటి పార్టీలపై పోలీసులు దాడిచేసి నిర్వహకులను అరెస్ట్ చేస్తుంటారు. అలాగే.. పార్టీలో పాల్గొన్నవారు డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిర్ణయించేందుకు టెస్టులు చేయిస్తుంటారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అశ్లీల కార్యకలాపాలకు కూడా రేవ్ పార్టీలు అడ్డాగా మారాయి. స్వయంగా నిర్వహకులే అమ్మాయిలను సరఫరా చేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూసాయి. కాబట్టి ఇలాంటి రేవ్ పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.